Krishna River: కృష్ణానదికు వరద ప్రవాహం క్రమంగా చేరుతున్నందున  ముందస్తుగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో లోతట్టు ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, రానున్న రోజుల్లో 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద చేరే అవకాశం ఉందన్నారు.

ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా నది మీద  ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు. 

బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.

మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం క్యూసెక్కుల్లో 

ప్రాజెక్టు ఇన్‌ఫ్లో అవుట్‌ ఫ్లో
సుంకేశుల ప్రాజెక్టు  1.25 లక్షల క్యూసెక్కులు 1.24 లక్షల క్యూసెక్కులు 
శ్రీశైలం డ్యామ్  2.68 లక్షల క్యూసెక్కులు 2.91 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్   2.55 లక్షల క్యూసెక్కులు  2.48 లక్షల క్యూసెక్కులు
పులిచింతల  1.56 లక్షల క్యూసెక్కులు  65,256 క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్  13,133 క్యూసెక్కులు 13,133 క్యూసెక్కులు

గోదావరి,కృష్ణా నదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.