Chandrababu Singapore Tour | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో ఫలితాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం జరిగిన భేటీ పై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్ సీ లెంగ్ కీలక  ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. 

Continues below advertisement


‘భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒకటి. ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించాం. 2014- 2019 సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేశాం. అమరావతికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించాం. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు దక్కించుకున్నాయని’ సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ గుర్తుచేసుకున్నారు.


వైసీపీ హయాంలో సహకారం ఆగిపోయిందన్న సింగపూర్ మంత్రి
2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందువల్లే రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని స్పష్టం చేశారు. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా.. అమరావతితో పాటు ఏపీలో పట్టణాభివృద్ధి సహా పలు రంగాల్లో అభివృద్ది ప్లాన్‌లో ఏపీ ప్రభుత్వంతో మరోసారి కలిసి పని చేస్తామని టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు.


గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కావు


మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌కు కావాలని మంత్రి టాన్ సీ లెంగ్‌తో భేటీలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు పరిష్కరించాలని తాను సింగపూర్ వచ్చినట్లు చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా  రికార్డులు సరి చేస్తామన్నారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతోనే గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని సింగపూర్ ను చూసే చేపట్టినట్లు తెలిపారు. నవంబరు నెలలో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని టాన్ సీ లాంగ్ ను చంద్రబాబు ఆహ్వానించారు. 


గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి
 గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు సింగపూర్ ఆసక్తిగా ఉంది. ఈ రంగంలో సింగపూర్- ఏపీ కలిసి పని చేస్తాయని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గృహనిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకు సహకారంతో కలిసి పని చేస్తున్నామన్నారు. గతంలో హైదరాబాద్ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యానని నాటి సంగతులను సింగపూర్ మంత్రి గుర్తు చేసుకున్నారు.