YS Jagan Mohan Reddy | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి NCLTలో ఊరట లభించింది. సరస్వతీ పవర్ షేర్ల బదిలీ సాధ్యం కాదని NCLT బెంచ్ స్పష్టం చేసింది. షేర్ల బదిలీపై జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగియగా, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ, సీబీఐ కేసులు విచారణలో ఉన్న సమయంలో సరస్వతీ పవర్ కంపెనీ షేర్ల బదిలీ అక్రమనేనని ఎన్‌సీఎల్టీ స్పష్టం చేయడంతో వైసీపీ అధినేత జగన్‌కు భారీ ఊరట లభించింది.

సరస్వతీ పవర్ భూములు రద్దు..

వివాదాలకు కేంద్రంగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం 2024 డిసెంబర్ నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీకి ఇచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం వేమవరం(Vemavaram)లో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మార్వో ఆదేశాలు జారీ చేశారు. 

వైఎస్‌ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సమయంలో సరస్వతి పవర్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం భూములు తీసుకొని అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆలోచించింది. తమ భూములను లాక్కొని ఎలాంటి ఉపాధి కల్పించలేదని స్థానికులు సైతం సరస్వతీ పవర్ భూములపై ఫిర్యాదులు చేశారు. ఆ పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

భూముల రిజిస్ట్రేషన్ రద్దు

సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని అధికారులు నివేదిక ఇవ్వడంతో ఆ భూములపై సర్కార్ చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ సురేశ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో జగన్ ఫ్యామిలీకి భూములు కేటాయింపు..

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు. వైఎస్సార్ హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలున్నాయి. చెన్నయపాలెం, పిన్నెల్లి, వేమవరం, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్ ప్లాంట్ ఓనర్లు కొనుగోలు చేశారు. కానీ అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు తెలిపారు. ఈ భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయన్న ఆరోపణలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అక్కడ పర్యటించారు. దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించగా పరిశీలించి వారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు.