Crowdstrike Issue At Vijayawada Airport | గన్నవరం: మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతో పాటు భారత్ పై పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. తెలంగాణలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం నుంచి 35కు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏపీలో కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు విమాన సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో క్లారిటీ లేక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. స్క్రీన్ లపై బ్లూ కలర్ మెస్సేజ్‌లతో పలు విమాన సర్వీసులు ఆలస్యం, బోర్డింగ్ పాస్ లపై, మాన్యువల్ గా రాసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. 


సాంకేతిక లోపంతో సర్వీసులు ఆలస్యం 
ఈ సమస్యలపై గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీ కాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి 23 వరకు విమాన సర్వీసులు పలు ప్రదేశాలకు బయలుదేరి వెళ్తాయన్నారు. శుక్రవారం 13 విమాన సర్వీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యాయి. మరో 7 విమాన సర్వీసులు ఆలస్యంగా టేకాఫ్ అయినట్లు తెలిపారు. అయితే క్లౌడ్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వల్ల నేటి (జులై 19న) ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ఇదే ఆలస్యం  కొనసాగితే మరింత మంది ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 


మాన్యువల్ చెకింగ్ చేస్తున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది 
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పలు దేశాల్లో అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. కొన్నిచోట్ల విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా సర్వీసులు నడుతుస్తున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్‌పోర్టుకు వస్తున్న విమానయాన ప్రయాణికులకు, మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నట్లు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. బ్యాగేజీ సైతం మాన్యువల్ గా చెక్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో టికెట్ కౌంటర్లో ప్రయాణికులకు టికెట్ల జారీ నిలిపివేశారు. రెండు, మూడు రోజులు ఇలాగే ప్రాబ్లం కొనసాగితే, విమాన సర్వీసులు నడపడం కష్టమన్నారు. త్వరగా సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నారు.


Also Read: Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్‌లో వచ్చిన సాంకేతిక సమస్య ఇదే, ఈ స్థాయిలో ప్రభావం పడింది అందుకే!