విజయవాడలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వార్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. రెండు వర్గాలను చెదరకొట్టారు. ఈ వ్యవహరం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాణీగారి తోట ప్రాంతంలో చివరి రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
గడప గడపకు కార్యక్రమం ఇంకా ప్రారంభం కాకముందే టీడీపి చెందిన కొందరు మహిళలు స్థానికంగా హడావిడి చేశారు. వైసీపీ నేతలు వస్తుంటే అటు వైపుగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో స్థానికులు కలకలం రేగింది. టీడీపీ మహిళలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నరాని వైసీపీ శ్రేణులు ప్రతిగా రియాక్ట్ అయ్యాయి. వైసీపీకి చెందిన మహిళలు కూడా రంగంలోకి దిగారు.
ఇలా రెండు వర్గాల మహిళా కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్త తోపులాట వరకు వెళ్లింది. దీంతో టీడీపీకి చెందిన మహిళలు కారం ప్యాకెట్లు తీసుకువచ్చి ప్రత్యర్థి వర్గంపై చల్లటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వైసీపీ మహిళలు ఎదురు దాడికి దిగారు. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. ఇలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
దేవినేని అవినాష్ మండిపాటు..
ప్రశాంత వాతావరణంలో ఉన్న రాణీగారి తోట ప్రాంతాన్ని టీడీపీ నేతలు రాజకీయాల కోసం వాడుకొని, శాంతి భద్రతలకు సమస్యగా చిత్రీకరించేందుకు యత్నించారని వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తించారని, మహిళలను రెచ్చకొట్టి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి చీఫ్ ట్రిక్స్‌ను స్థానిక టీడీపీ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ చేయిస్తున్నారని ఆరోపించారు.
రంగంలోకి జనసేన....
ముస్లిం వర్గానికి చెందిన షేక్ ఫాతిమా రమీజాపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారని జనసేన పార్టీ విజయవాడ కమిటి తీవ్రంగా ఖండించింది. పథకాలు రావట్లేదు ప్రజలు అడిగితే దుర్భాషలాడటం దారుణమని, అండగా ఉండాల్సింది పోయి ఇంటికి వెళ్లి దాడి చేయటం ఏంటని జనసేన విజవాడ అధ్యక్షుడు పోతిన మహేష్ ప్రశ్నించారు. దేవినేని అవినాష్‌పై ఆయన అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనతో అవినాష్ ఓటమి ఖరారు అయిపోయిందని వ్యాఖ్యానించారు. మహిళలపై దాడి చేయడం హేయమైన చర్యని, సీఎం జగన్ ఇంటికి కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటన పై స్పందించాలి బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. స్థానిక సీఐ దామోదరానికి తెలిసే ఈ ఘటన జరిగిందని దీనిపై విచారణ జరిపించి పోలీస్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే గద్దె సీరియస్....
ఈ ఘటనపై టీడీపీ శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. అమాయకులైన మహిళలపై దాడులకు పాల్పడటం దారుణమైన ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార బలంతో ఇష్టానుసారంగా దాడులకు పాల్పటం సిగ్గుమాలిన తనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాల గురించి అర్హులైన మహిళలు నిలదీయటంతో చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు కారం చల్లి రాజకీయం చేయటం ఏంటని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న పోలీసలు సమక్షంలోనే ఇదంతా జరిగిందని పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఫైర్ అయ్యారు.