మాజీ ఉప- రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బెజవాడలోని కాకా హోటల్ లో టిఫిన్ చేశారు. ఉన్నపళంగా ఆయన హోటల్ కు వచ్చి టిఫిన్ ఆర్డర్ ఇవ్వటంతో హోటల్ నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. విజయవాడ నగరంలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ) లో టిఫిన్ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దేశానికి ఉప రాష్ట్రపతిగా పని చేసిన ఆయన సింపుల్ గా వచ్చి టిఫిన్ ను ఆర్డర్ చేశారు. ముందస్తుగా సమాచారం లేకపోవటంతో హోటల్ నిర్వహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో‌ కలిసి నేతి ఇడ్లీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు టేస్ట్ చేశారు. ఈ ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చిన వెంకయ్యనాయుడు, నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు.


మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


టేస్టీ ఇడ్లీపై మాజీ ఉప రాష్ట్రపతి ఎమన్నారంటే..


విజయవాడ నగరంలో సాధారణ పాక ఇడ్లీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని గుర్తు చేసుకున్నారు. నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానని చెప్పారు. సాంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని నేటి తరానికి వెంకయ్య సూచించారు. పిజ్జా, బర్గర్ల ద్వారా ఆరోగ్యాన్ని పాడు‌ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. యువతకు కూడా మన వంటకాల రుచులను చూపించి అలవాటు చేయాలని, ఈ‌ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనని, అలాగే మన సంప్రదాయ వంటలే మనకు బలమని చెప్పారు. వ్యాయామం మనకి ఎంత ముఖ్యమో మన వంటలే తినడం అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ సందర్బంగా తాను ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని చెప్పారు.




ఆశ్చర్యపోయిన హోటల్ నిర్వహకులు..


దేశానికి ఉపరాష్ట్రపతిగా పని చేసిన వెంకయ్య నాయుడు వంటి వ్యక్తి తన హోటల్ కు రావటం సంతోషంగా ఉందని హోటల్ నిర్వహకులు క్రిష్ణ ప్రసాద్ చెప్పారు. నలభై యేళ్లుగా  ఇక్కడ ఇడ్లీ సెంటర్ ను నడుపుతున్నామని అన్నారు. తన తండ్రి మల్లికార్జున రావు హోటల్ ను స్థాపించారని, పాక ఇడ్లీగా ప్రసిద్ధి చెందడంతో ప్రముఖులు కూడా వస్తుంటారని అన్నారు. వెంకయ్య నాయుడు తమ హోటల్ లో టిఫిన్ చేయడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన హఠాత్తుగా తమ హోటల్ కు రావడంతో ఆశ్చర్య పోయామని అన్నారు.


మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


సెల్ఫీల కోసం ఎగబడిన స్దానికులు..


దేశానికి ఉప రాష్ట్రపతి హోదాలో పని చేసిన వెంకయ్య నాయుడు సాధారణ పూరి పాక హోటల్ లో టిఫిన్ చేయటానికి రావటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నపళంగా పోలీసులు రావడం, హడావుడి చేయటం, ప్రోటో కాల్ ఏర్పాట్లు చేయటం చూసిన వారంతా ఏం జరుగుతుందో అని ఆత్రుతగా చూశారు. అయితే అంతలోనే వెంకయ్య నాయుడు నవ్వుతూ కారు దిగారు. ఆయన్ను చూసిన సంతోషంలో స్థానికులు ఆయనతో సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వెంకయ్య నాయుడు గన్నవరం నుండి ప్రత్యేకంగా హోటల్ లో టిఫిన్ చేసేందుకు రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతటి హోదాలో ఉన్నా, అందరూ ఆహార ప్రియులేనంటూ స్థానికులు నవ్వుతూ కామెంట్స్ చేసుకున్నారు.