Vijayawada Temple News | విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ దుర్గగుడికి 3.08 కోట్ల రూపాయల కరెంట్ బిల్లుల బకాయిలు  ఉన్నాయంటూ విద్యుత్ శాఖ అధికారులు అధికారులు శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 2023 ఫిబ్రవరి నుంచి తమకు బిల్లులు చెల్లించలేదన్న విద్యుత్‌ శాఖ బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు  తెలిపారు. 

Continues below advertisement

సోలార్‌ ప్లాంట్‌ విద్యుత్ సరఫరా

ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అలాగే తమ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్‌ మీటరింగ్‌ కోసం విద్యుత్‌ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది. 

Continues below advertisement

విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని శుక్రవారం సాయంత్రమే దుర్గగుడి ఈవోకు సమాచారం ఇచ్చినట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు.

మా దగ్గర కరెంట్ తీసుకుంటూ మాకే లైన్ కట్ చేస్తారా? : దుర్గ గుడి అధికారులు

ఈ ఘటన ఫై అసంతృప్తి వ్యక్తం చేసిన దుర్గ గుడి అధికారులు అసలేం జరిగింది అన్న విషయం ఫై వివరణ ఇచ్చారు. " గత రెండు సంవత్సరాలుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 24 మెగావాట్ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి స్పష్టతను సాయంత్రం లోపు తెలియజేయడం జరుగుతుంది " అంటూ దుర్గగుడి అధికారులు స్పష్టత ఇచ్చారు.

దుర్గ గుడి కి మళ్ళీ వచ్చిన కరెంట్ విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన ఈఓ (E.O.) గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారులతో చేసిన చర్చలు ఫలించడం తో శనివారం సాయంత్రం నాటికి ఆలయ పరిసరాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. దీనితో భక్తులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

భక్తుల మనోభావాలతో ఆటలొద్దు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆగ్రహం

దుర్గగుడి విద్యుత్ సమస్య ఫై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడారు. 2022  నుంచి విద్యుత్ బోర్డుతో  దుర్గ గుడి దేవస్థానం సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుంది అని తెలిపిన మంత్రి విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి గతంలో ఉన్న బకాయిలు చెల్లించేందుకు  శ్రీకారం చుట్టినట్టు స్పష్టత ఇచ్చారు.అలాగే అమ్మవారి ఆలయ ప్రతిష్ట,కోట్లాదిమంది భక్తులమనోభావాల దృష్ట్యా ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు.ఏదేమైనా ఏకంగా దుర్గగుడి కే కరెంట్ నిలిపి వేశారన్న వార్త విజయవాడ లో సంచలనం గా మారింది.