తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో నేతలకు సంబంధించిన ఆఫీస్‌లు, ఇళ్లపై రైడ్స్ జరగుతున్నాయి. తెలుగు దేశం నేత రాయపాటి సాంబశివరావుతోపాటు మలినేని సాంబశివరావు అనే వ్యాపారి ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. 


మంగళవారం ఉదయం నుంచి రాయపాటి, మలినేని ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. వీళ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీలో లెక్కలపై ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లూ, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, గుంటూరు సహా 9 ప్రాంతాల్లో టీంలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. 


గతంలో ఈ ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల్లో 9 వేల కోట్లపైగా రుణాలు తీసుకొని మళ్లించినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ డబ్బును డొల్ల కంపెనీల పేరుతో అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేసింది. . ఇందులో జరిగిన మనీలాండరింగ్‌పై ఆరాలు తీస్తోంది. 


ట్రాన్స్‌ స్ట్రాయ్ కంపెనీ డైరెక్ట్‌ర్‌గా ఉన్న మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్ట్‌రుగా ఉన్నారు. 2020లో కూడా ఈయన నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీ నుంచి సింగపూర్‌లోని కంపెనీకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు అధికారులు పసిగట్టారు. వాటిపై క్లారిటీ కోసమే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని టాక్. 
లోన్ కింద తీసుకున్న డబ్బులను వేర్వేరు కంపెనీలకు మళ్లించారని... వాటితో బంగారం, వెండి కొన్నట్టు సీబీఐ గుర్తించిందది. 2013లో ఈ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే దాన్ని బ్లాంక్‌లు నాన్‌ పర్ఫామింగ్‌ అసెట్‌గా మార్చేశారు.