AP CM YS Jagan Mohan Reddy: జగనన్న సురక్ష రికార్డులను బ్రేక్ చేసింది. వరుసగా నెల రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.


జగనన్న సురక్ష 30 రోజుల్లో జరిగిందేంటంటే...
31 రోజుల్లో 15,004 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి, 2.68 లక్షల క్లస్టర్లలో 1.42 కోట్ల ఇళ్లను సందర్శించిన వాలంటీర్లు స్దానిక ప్రజల నుండి 93.36 లక్షల వినతులను స్వీకరించి వాటికి, పరిష్కారం చూపించారు. అయితే  జూలై 18వ తేదీ ఒక్కరోజే  7.54 లక్షల వినతులను తీసుకొని వాటికి పరిష్కారం కూడా చూపించటం మరొక రికార్డుగా ప్రభుత్వం ప్రకటించింది. 
‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో సంచలనంగా మారినట్లుగా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న ప్రదాన లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల జరుగుతుండగా రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయించారు.  


వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందించి వారిలో సంతోషం చూడాలని జగన్ సర్కార్ పట్టుదలతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన వచ్చింది.  మొదటిరోజు మొత్తం 1305 చివాలయాల పరిధిలో 4,73,930 వినతులు వస్తే వాటిల్లో ప్రభుత్వం అక్కడిక్కడే పరిష్కరించిన అర్జీల సంఖ్య 4,57,642 కావటం విశేసం. 31వ తేదీ నాటికి మొత్తం 15,004 సచివాలయాల పరిధిలో ఉన్న 1.42 కోట్ల కుటుంబాల నుంచి 95.96 లక్షల వినతులు వస్తే 93.36 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయని ప్రభుత్వం లెక్కలు ద్వారా వెల్లడించింది.


వాలంటీర్లే కీలకం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  2.68 లక్షల మంది వాలంటీర్లు జగనన్న సురక్షా శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 1.42 కోట్ల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 7,65,722 అభ్యర్థనలు వచ్చాయి. అందులో  7,62,655 అర్జీలను అధికారులు పరిష్కరించారు.  అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 1,27,474 అభ్యర్థనలు వచ్చాయి, అందులో  1,22,300 అర్జీలు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు.  ఇప్పటి దాక 45,33,654 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 41,50,275 ఆదాయ ధృవీకరణ పత్రాలు, 7,326 ఓబీసి సర్టిఫికెట్లు, 2,366 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 16,373 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 1,40,114 అడంగల్ సర్టిఫికెట్లు, 2,70,194 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశామని ఇవన్నీ వాలంటీర్ల చేతులు మీదగానే జరగటం మంచి పరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది..


ఇక ఆరోగ్య శ్రీ కార్డులు 6,511, కొత్త బియ్యం కార్డులు 15,081, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు  89,102 అర్జీలు , ఆధార్ తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 2,72,305 ఉన్నాయి. అలాగే పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 4,631 ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని జగనన్న ప్రభుత్వంలో అధికారులతో ఏ పనీ ఉన్నా సులభంగా పూర్తవుతున్నాయనే అభిప్రాయాన్నిక్రియేట్ చేసేందుకు, సర్కార్ తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. అర్హత ఉండి కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వాలంటీరును కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వ సేవలు అందుతాయని వెల్లడించారు.