తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించారు. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా.. వారి ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉండేది. అయితే, సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటామని అప్పట్లో చెప్పారు. కానీ, తాజాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణిస్తారు.


కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఆర్టీసీ విలీనం కోసం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉంటారు. ఆర్‌ అండ్‌ బీ, రవాణాశాఖ, సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. వీరు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయాలి. ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నాం. అదే రోజు శాసన సభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడతాం. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.


ఆర్టీసీ ఎండీ స్పందన


‘‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇది. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ గారికి‌ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తూ.. వీసీ సజ్జనార్’’ అని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.






కేబినెట్ ఇతర కీలక నిర్ణయాలు ఇవీ..


* వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించాం. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించాం. రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని ఆమోదించాం.


* గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలలో తిరిగి తీర్మానం చేసి పంపుతాం. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదు. 


* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. 


* వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం


* హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉంది. హైదరాబాద్ లో హాకింపేట ఎయిర్‌పోర్టును గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం


* మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం