DGP of Andhra Pradesh అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర పోలీస్ బాస్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ద్వారకా తిరుమల రావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు
వాస్తవానికి గత నెలలో ఏపీలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్ గా ఛాన్స్ ఇచ్చారు. ఈసీ నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం హరీష్ గుప్తా డీజీపీగానే కొనసాగింది. ఇటీవల ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ పర్వం కొనసాగుతోంది.
ఈ ఏడాది మే నెలలో కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కాగా, రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తరువాత సీనియర్లు అయిన అంజనా సిన్హా, ఎం ప్రతాప్ లను కాదని హరీష్ ను పోలీస్ బాస్‌గా ఈసీ నియమించింది. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర డీజీపీగా నియమించింది.
ద్వారకా తిరుమలరావు కెరీర్
1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ పదవీ కాలం మే 31న ముగియడంతో ఈయనకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. కాగా, గత మూడేళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు రైల్వే శాఖ డీజీపిగా ఉన్నారు. విజయవాడ సీపీగానూ సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. గతంలోనూ విజయవాడ సీపీగా చేసిన గౌతమ్ సవాంగ్.. వైసీపీ ప్రభుత్వంలో డీజీపీ అయ్యారు. అనంతరం ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గానూ సవాంగ్ సేవలు అందించారు.