Devi Sea Foods Rs.5 Crore Donation | అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా జూన్ 12న ప్రమాణం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో సైతం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న ఏపీ ప్రభుత్వానికి విరాళాల వెల్లువ మొదలైంది.
దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల విరాళం
ఏపీ ప్రభుత్వానికి దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం అందించింది. కనెక్ట్ టు ఆంధ్రాకు ఈ మొత్తాన్ని విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ మొత్తాన్ని అందించినట్లు సంస్థ తెలిపింది. రూ.5 కోట్ల విరాళం చెక్కును దేవీ సీఫుడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం చంద్రబాబుకు అందజేశారు. శుక్రవారం సచివాలయానికి వచ్చిన బ్రహ్మానందం సీఎం చంద్రబాబును కలిసి, ఆయనతో పలు విషయాలపై చర్చించారు.
అన్న క్యాంటీన్ నిర్వహణకు యువతి రూ.లక్ష విరాళం
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ హయాంలో ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను బంద్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధిరంచి, తక్కువ ఖర్చుకే పేదవాడికి అన్నం పెట్టడం అని తెలిసిందే.
చంద్రబాబు ప్రభుత్వం త్వరలో పునరుద్ధరించనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకుగానూ గుంటూరు యువతి మర్రిపూడి సుష్మ విరాళం అందించారు. సీఎం చంద్రబాబును శుక్రవారం సచివాలయంలో కలిసి రూ.1లక్ష రూపాయల చెక్కు ఆమె అందించారు. గుంటూరు పట్టణం, వికాస్ నగర్ చెందిన సుష్మ అమెరికాలో ఓ ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తున్నారు.
అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడం ఆమె తెలుసుకున్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసి.. రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుసాయంగా విరాళం అందించారు. పెద్ద మనసుతో తన వంతుగా అన్న క్యాంటీన్ నిర్వహణకు చెక్కు అందించిన సుష్మతో పాటు ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, మంజువాణిని సీఎం చంద్రబాబు అభినందించారు.