Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారమైన కథనాలను తక్షణం తొలగించాలంటూ పలు ఛానెళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన సూచించిన తేదీల మధ్య ప్రసారమైన కథనాలను తొలగించాలని లేదా ఎవరూ చూడకుండా బ్లాక్ చేయాలని ఆదేశించింది. శాంతి కేసులో ఓ వ్యక్తి ఆరోపణలను ఆసరాగా చేసుకుని రాజకీయంగా అణగదొక్కడమే ధ్యేయంగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను తనకు ఆపాదించారని తెలిపారు. ఇకపై తనకు వ్యతిరేక కథనాలు రాయకుండా ఆయా మీడియా ఛానెళ్లను నియంత్రించాలని కోరారు. ఈ మేరకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా కథనాలను ప్రసారం చేసిన ఆయా ఛానెళ్లపై రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆయన కేసు వేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ కాపీని ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏకంగా 9 ప్రముఖ తెలుగు వార్తా ఛానెళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే...
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కడుపులో పుడుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపించారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఎలా గర్భవతి అయ్యావని ప్రశ్నిస్తే ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతోందంటూ మీడియా ముందుకొచ్చారు. ఒకసారి ఐవీఎఫ్ చేయించుకుందని, ఒకసారి తన భర్త సుభాష్ అని చెబుతోందని ఆరోపించారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసి న్యాయం చేయాలని అధికారులను కోరారు. సుభాష్ కూడా డీఎన్ ఏ టెస్ట్ కు తొలుత అంగీకరించాడని ఆ తర్వాత అదృశ్యమయ్యాడని మదన్ మోహన్ ఆరోపనలు చేశారు. అసలామె తనకు విడాకులు కూడా ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. ఆమె ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి తీసుకున్న పలు ఫొటోలు మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. ఆమె విజయసాయిరెడ్డి నుంచి గిప్టులు తీసుకుందని, లేదంటే ఖరీదైన చీరలు, అపార్ట్‌మెంట్ ఎలా వచ్చాయనేది ఆయన ఆరోపణ. దీంతో ఒక్కసారిగా విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.
సవాల్ చేసి చెప్పిన విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ప్రెస్ మీట్ పెట్టారు. కొన్ని ఛానెళ్లపై మండిపడ్డారు. పనిగట్టుకొని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని సవాల్ చేశారు. చెప్పినట్టుగానే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తనపై ఇక ముందు కూడా వ్యతిరేక కథనాలు ప్రసారం కాకుండా నిలువరించడంతోపాటు ఇప్పటికే ఉన్న వార్తలను తొలగించేలా కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది.
వయసుతో కూడా సంబంధం లేకుండా ఇలాంటి వార్తలతో తన జీవితాన్ని రోడ్డున పడేశారంటూ శాంతి మీడియా ముందుకొచ్చారు. ఒక ఎంపీని కలిస్తే మాకు సంబంధాలను అంటకట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. గిరిజన బిడ్డ మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు.