- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 
- వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌
- బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో గొప్ప చారిత్రక గ్రంధం...
తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ: ‘మన దేశ ప్రజలు తమకోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకుని, 1949లో తమకు తాము సమర్పించుకున్న ఈరోజు ఈ నవంబరు 26. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగం దాదాపు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాల మాగ్నాకార్టా. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే సంఘ సంస్కరణల చరిత్రలోనే అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంధం రాజ్యాంగం’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కి హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. తోటి మంత్రివర్గానికి, అధికారులకు, ఏపీలోని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్‌...
ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అంటే.. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3వేల కులాలు, ఉపకులాలతో కలిపి 25వేల కులాలు, ఏడు ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని వేర్వేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలున్న  దేశానికి, మన ప్రభుత్వాలకు ఈ దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు, మనందరికీ క్రమశిక్షణ నేర్పే ఒక రూల్‌బుక్‌. మనకు దిశా నిర్దేశం చేసే ఒక గైడ్‌. ఒక ఫిలాసఫర్, ఒక టీచర్‌.


దేశ సౌర్వభౌమాధికారానికి ప్రతీక మన రాజ్యాంగం.
ఇంత గొప్పదైన మన రాజ్యాంగాన్ని మనకు ఎవరు అందించారు అంటే.. అంతకముందు పుస్తకం ముట్టుకోవడానికి వీలులేని సమాజంలో జన్మించి.. ఎవ్వరూ చదవనన్ని చదువులు చదివి, ఎవరికీ లేనన్ని డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకుని ఈ దేశం మారడానికి, నిలబడడానికి, ప్రపంచంతో సైతం పోటీపడడానికి, ఎదగడానికి, ప్రగతిపథంలో పరిగెత్తడానికి కావాల్సిన ఆలోచనలు ఈ రూల్‌బుక్, ఈ పవిత్ర గ్రంధాన్ని, ఈ రాజ్యాంగ పుస్తకాన్ని రచించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్‌.


72 ఏళ్లుగా రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త...
ఈ రాజ్యాంగం 72 ఏళ్లుగా మన సామాజిక వర్గాల చరిత్రను తిరిగరాసింది. రాస్తూనే ఉంది. ఈ పుస్తకం మన ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్ర గతిని మార్చింది. మారుస్తూనే ఉంటుంది. ఈ పుస్తకం మన భావాల్ని, భావజాలాల్ని మార్చింది. మారుస్తూనే ఉంటుంది. 72 సంవత్సరాలుగా ఈ మన రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త. ఈ పుస్తకమే మన మధ్య  ఎన్ని భిన్నత్వాలు ఉన్నా... ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టింది. ఇక మీదట నిలబెడుతూనే ఉంటుంది. 


రాజ్యాంగం – నిస్సహాయులకు దైవమిచ్చిన ప్రజాయుధం.
నిస్సహాయులకు, నిరుపేదలకు, అణగారిన వర్గాల వారికి అధికార దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం కూడా ఈ రాజ్యాంగమే. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన ఆ మహనీయుడుకి, ఆకాశమంతటి ఆ మహామనిషికి, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కి అంజలి ఘటిస్తూ ఇదే విజయవాడ నడుమ 2023 ఏప్రిల్‌లోనే అంబేద్కర్‌ మహా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్‌ భావజాలాన్ని మన రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే ప్రభుత్వంగా ఈ మూడున్నర సంవత్సరాల పాలనలో ఎలాంటి ముందడుగు వేశామో క్లుప్తంగా చెపుతాను. 


గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేస్తూ....
రాజ్యాంగంలో చెప్పిన గ్రామస్వరాజ్యానికి రూపకల్పన చేసి దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధను అమలు చేస్తున్న ప్రభుత్వం బహుశా మనదే. ప్రభుత్వ బడులలో పేదలకు ఇంగ్లిషు మీడియంలో చదువుకునే అవకాశం లేకుండా చేయడం ద్వారా రూపం మార్చుకుని.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పట్ల పాటిస్తున్న నయా అంటరానితనం మీద సీబీఎస్‌ఈ ఇంగ్లిషు మీడియంతో మొదలు, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, డిజిటల్‌ క్లాస్‌రూముల వరకు విద్యారంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం మనది. 


పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు...
నామినేటెడ్‌ పదవులు, పనులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. 


మహిళా సాధికారతకు అర్ధం చెబుతూ... 
జగనన్న అమ్మఒడి, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ సున్నావడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుమీదే రిజిస్ట్రేషన్, ఇప్పటికే మంజూరు చేసిన 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్‌ వంటి అనేక ముందడుగులు వేసిన మహిళ ప్రభుత్వం కూడా మనదే.  రాజధానికి సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్ధలాలకు కేటాయిస్తూ డెమొగ్రాఫిక్‌ ఇంబేల్సన్‌ వస్తుందని... అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదాలు, వాదనలతో కూడా మనం యుద్ధం చేస్తున్నాం. 


వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, ఆసరా, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, విద్యా దీవెన, తోడు, చేదోడు,  కాపునేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాకాను‌క, గోరుముద్ద, 30 లక్షల ఇళ్లపట్టాలు, చేయూత, బడులలోనూ, ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి సామాజిక, ఆర్ధిక తారతమ్యాల నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే.


35 నెలల పాలనలో....
మన 35 నెలల పాలనలో డీబీటీ ద్వారా అంటే నేరుగా బటన్‌ నొక్కి ప్రజలకు వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లలోకి వెళ్లే గొప్ప వ్యవస్ధను తీసుకువచ్చాం. లంచాలకు తావులేకుండా, విచక్షణకు తావులేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటివరకు రూ.1,76,517 కోట్లు. గత 35 నెలల్లో డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా రూ.3,18,037 కోట్ల రూపాయలు. ఇందులో  ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అందినది 79 శాతం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. ఇక్కడే నాతోపాటు హాజరైన నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే మొత్తం మంత్రిమండలిలో దాదాపు 70  ఈ సామాజిక వర్గాలే. రెండు మంత్రివర్గాలలోనూ  5 గురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో 4 గురు అంటే 80శాతం నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించాం. 


చట్ట సభల్లోనూ...
శాసనసభ స్పీకర్‌గా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని, శాసనమండలి చైర్మన్‌గా ఒక ఎస్సీని నియమించడమే కాకుండా.. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్ధానంలో కూర్చొబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యయనం. ఈ మూడు సంవత్సరాలలో రాజ్యసభకు 8మందిని పంపితే అందులో 4గురు బీసీలే. శాసనమండలికి అధికార పార్టీ నుంచి 32 మందిని పంపిస్తే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే.


13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో 86 శాతం, మున్సిపాల్టీలలో 69 శాతం, మండల ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌లలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకే కేటాయించాం.


కార్పొరేషన్ల ఛైర్మన్లగానూ...
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 58 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదికిన బీసీ కమిషన్‌ను కూడా నియమించిన ప్రభుత్వం మనదే.
ఇవి ఈ 35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసుపెట్టి తీసుకువచ్చిన మార్పులు. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు.