ఏపీలో మోదీ పర్యటనకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. నవంబర్ 11, 12 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలు తీర్మానించారు. విజయవాడలోని ఆంద్రరత్నభవన్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లీడర్లు భేటీ అయ్యారు. 


మోదీ టూర్‌పై కాంగ్రెస్ మండిపాటు..


ఏపీ పర్యటకు ఏ మొహం పెట్టుకొని మోదీ వస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని, నిధులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ఏమీ చేయలేదని ఆరోపించారు. రాజదాని అమరావతి శంకుస్థాప సమయంలో నీరు, మట్టి తెచ్చి మాటలు చెప్పిన మోదీ ఆ తరువాత ఎందుకు తన మాటలను అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. విభజన తరువాత టీడీపీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కూడ మోదీ ఏపీకి చాలా సార్లు వచ్చారని అప్పుడు కూడా ఏం చేయలేదన్నారు. ఏపీని గుజరాత్ తరహాలో ముందుకు నడిపిస్తామని మోదీ మాటలు చెప్పి తప్పించుకున్నారని ఆరోపించారు. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. 


అప్పట్లో టీడీపీతో జతకట్టిన బీజేపి నేతలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో అనేక హామీలు ఇచ్చారన్నారు. నేడు ఏపీకి రాజధాని కూడా ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో గందరగోళంగా ఉందన్నారు. ఈ పరిస్థితులకు బీజేపీ, మోదీ నాయకత్వంలోని మోదీయే కారణమని మండిపడుతున్నారు. 


అందుకే మోదీ విశాఖ పర్యటన సందర్భంగా వివిధ స్థాయిల్లో నిరసనలు తెలిపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నల్లజెండాలు, రిబ్బన్లు ప్రదర్శించటంతోపాటుగా బ్యానర్లు, ప్లకార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ వ్యవహర శైలి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఇదే వేదికపై చర్చించారు నేతలు. రాష్ట్రానికి బీజేపి చేసిన మోసం, జగన్, బీజేపి కలసి ఆడుతున్న నాటకాలపై ప్రజలకు అంశాల వారీగా వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నాయకులంతా గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకొని నిరసనలను తెలపాలని  సూచించారు. 


గన్నవరంలో నల్లబెలూన్లు ఎగరేసిన కాంగ్రెస్ 


కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అవ్వాల్సి వచ్చింది. ఇటీవల మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ నిరసనలు తెలిపింది. గన్నవరం విమనాశ్రయం వద్ద నల్లబెలూన్లు ఎగర వేసి సంగతి అందరికీ తెలిసందే గాల్లోకి ఎగిరిన నల్లబెలూన్లు మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు దగ్గరలో వెళ్లాయి. దీనిపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది. పోలీసులు వైఫల్యంపై బీజేపి నేతలు మండిపడ్డారు. నల్లబెలూన్ల సంఘటనపై కేంద్ర పార్టీకి కూడా ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు విచారణ చేసి, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.


రాహుల్ జోడో యాత్ర స్పూర్తితో...


రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఏపీలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఇదే స్ఫూర్తితో పాదయాత్ర చేయాలని నేతలు నిర్ణయించారు. డిసెంబరు మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల కవర్ చేసేలా పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు శైలజానాథ్. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నిరంతరం పని చేస్తామని రాబోయే రోజుల్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించి, క్యాడర్‌కు దగ్గర అయ్యేందుకు అవసరమైన అన్ని మార్గాల్లో పని చేస్తామని వెల్లడించారు.