CM YS Jagan: హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులకు అడ్డుకట్ట పడాలని చెప్పిన సీఎం.. అందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేశారు. మహిళా పోలీసుల ప్రస్తుత విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనులు, చేర్పులపై ఆలోచించాలని ఆదేశించారు.


రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరూ దిశ యాప్ వాడేలా అవగాహన కల్పించాలని, అందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుని వాడేలా చూడాలని తెలిపారు. ఇక, దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేయాలని చెప్పారు. మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలని అధికారులను ఆదేశించారు. మత్తుపదార్థాల రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉండాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన హోంశాఖ సమీక్ష సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.