Andhra Pradesh: భారీ వర్షాలకు విజయవాడ పూర్తిగా నీట మునిగింది. ఓవైపు వర్షాల ధాటికి మరోవైపు వరద నీరు పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోయింది. కనుచూపు మేర ఎటు చూసిన వరద నీరు దర్శనమిస్తోంది. ఎటు వెళ్లాలన్నా బోట్లు లేకుండా ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. నడుములోతులో నీళ్లే కనిపిస్తున్నాయి.
కృష్ణానదిలో వరద నీరు పోటెత్తడంతో రిటైనింగ్ వాల్ పై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. రామలింగేశ్వర్‌నగర్, గాంధీనగర్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేపిస్తున్నారు. ఆ ప్రాంతంలో సాధారణంగా నిడిచే పరిస్థితి లేదు. సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది.
బుడమేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో లొతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. సింగ్ నగర్, అయోధ్యనగర్, దేవీనగర్‌లోని కాలనీలన్నీ మునిగిపోయాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. పాతికేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి చూశామని ఇప్పుడు అదే రిపీట్ అుతుందని అంటున్నారు స్థానికులు. 2005లో బుడమేరు వరద నీరు ధాటికి బెజవాడ నీట మునిగింది. అప్పట్లో కూడా సెప్టెంబర్‌లోనే వరదలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు అదే టైంలో వరదలు వచ్చాయి.
నీట మునిగిప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యటిస్తున్నారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు. ఆదివారం తన హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. అర్థరాత్రి వరకు చంద్రబాబు పర్యటన సాగింది. ఆయనతోపాటు మంత్రులు నారాయణ, అనిత ఇతర అధికారులు ఉన్నారు.
విజయవాడలో వరదలు కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించించిపోయింది. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. రహదార్లపై నుంచి భారీగా వరద నీరు వెళ్లడంతో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. విజయవాడ మీదుగా వెళ్లే రైల్వే ట్రాక్‌లపై నుంచి కూడా వరద నీరు ప్రవహించడంతో దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని చాలా నెమ్మెదిగా పోనిస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. కొన్ని ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలే తెగిపోయాయి.
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చాలా ప్రాంతాల్లో సరఫరాల నిలిపేశారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందు అప్రమత్తమైన అధికారులు నీట మునిగే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాతిక ముప్ఫై ఏళ్లలో ఎప్పుడూ చూడనంత వరద ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఒకే రోజు దాదాపు ముఫ్ఫై సెంటీమీటర్ల వర్షపాత నమోదు అయింది.
శుక్రవారం నుంచి మొదలైన వర్షం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే ప్రతి ప్రాంతంలో నడుము లోతులో నీరు నిలిచిపోయి జనజీవనం స్థంభించిపోయింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీగా నీరు నిలిచిపోయింది.
Also Read: అల్పపీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్పడుతుంది? తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు