Just In





Chandra Babu And Jagan: జగన్, చంద్రబాబు పోటాపోటీ ఇఫ్తార్ విందులు! పవన్ కల్యాణ్ అటెండ్ అవుతారా?
Andhra Pradesh News: మార్చి 26న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ రానున్నారు. ఆ తర్వాత రోజు జరిగే ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరి పవన్ కల్యాణ్ హాజరవుతారా?

Andhra Pradesh News: రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు చాలానే చూస్తుంటాం. ప్రైవేటు వ్యక్తులే కాదు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ ముస్లింలకు విందులు ఇస్తుంటాయి. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందులో కూడా రాజకీయం జొరబడింది. అందుకే పోటాపోటీ విందులు సిద్ధమవుతున్నాయి.
ఏపీలో రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులకు రెడీ అవుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26న అంటే బుధవారం ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అందులో ఆయన కూడా పాల్గొంటున్నారు. గతేడాది ముఖ్యమంత్రి హోదాలో కదిరిలో నిర్వహించిన ఇఫ్తార్ విందు అటెండ్ అయిన జగన్ మెహన్ రెడ్డి ఈ ఏడాది విజయవాడలో పార్టీ నాయకులు ఇచ్చే ఇఫ్తార్‌కు అటెండ్ కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైసిపి ముస్లిం మైనారిటీ నాయకులు చేస్తున్నారు
27న ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్
ఏపీ ప్రభుత్వం ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇఫ్తార్ విందు ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీని కోసం కోటిన్నర రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఇఫ్తారు విందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటెండ్ కాబోతున్నారు. దీనికి ఆయనతోపాటు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరుకాబోతున్నారు.
అన్ని జిల్లాల కేంద్రాల్లో అదే రోజు జరిగే ఇఫ్తార్‌లో ఆహార పదార్థాలకు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 27 ఉదయం పోలవరం టూర్‌కి వెళ్లి సాయంత్రానికి తిరిగిరానున్నారు చంద్రబాబు. అనంతరం విజయవాడలో ఇఫ్తార్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు.
ఇఫ్తార్‌లో పవన్ పాల్గొంటారా?
అయితే ఇప్పుడు రాష్ట్రంలోని అందరి దృష్టి ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఉంది. గతంలో ఆయన ఇఫ్తార్ విందులకు హాజరైన చరిత్ర ఉన్నా ఇటీవల కాలంలో పూర్తిగా సనాతన ధర్మం వైపు టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 27న జరిగే ఇఫ్తార్‌కు అటెండ్ అవుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే సనాతన ధర్మం దీక్ష తీసుకున్నా ఇతర ధర్మాల పట్ల తనకు గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెబుతారు. కాబట్టి ఆయన సరైన నిర్ణయమే తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.