Pawan Kalyan on Delimitation | ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో త్రిభాషా విధానం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. త్రిభాషా విధానం (Three Language Formula) పేరుతో హిందీని మాత్రమే నేర్చుకోవాలని, ఏ భాష అయినా బలవంతంగా రుద్దడాన్ని తన వ్యతిరేకిస్తానని చెప్పారు. ఏపీ, కర్ణాటకలో త్రిభాషా విధానం అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అనే కోణంలో చూడాలన్నారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
ఇటీవల పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన (Janasena) ఆవిర్భావ దినోత్సవంలో ప్రముఖ తమిళ కవితతో పవన్ కళ్యాణ్ ప్రారంభించడం తెలిసిందే. తమిళంతో అనుబంధంపై ప్రశ్నకు బదిలిస్తూ.. టీనేజీలో ఉన్నప్పుడు తనకు జీవితంపై భయం కలిగిందని అప్పుడు అచ్చమెలై అచ్చమిళ్ళై (భయం లేదు.. భయం లేదు) అనే భారతీయార్ కవిత చదవగా తనకు ధైర్యం వచ్చిందన్నారు.
మాతృభాషపై ప్రేమ ఉంటుంది
ప్రతి భాషకు గౌరవం దక్కాలి. భాషను, సంస్కృతలను ప్రారంభించడం తన మార్గదర్శకాల్లో ఒకటని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 400 ఉర్దూ, 107 ఒరియా, 57 కన్నడ, 30 తమిళ, ఐదు సంస్కృతం, 37 వేల పైగా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎవరి మాతృభాషపై వారికి ప్రేమ ఉండడం సహజం. ఏ రాష్ట్రం పైన వేరే వారి భాషను బవంతంగా రుద్దకూడదు. అలా జరిగితే నేను కచ్చితంగా వ్యతిరేకిస్తాను. హిందీ నేర్చుకోవాలని, తమిళం నేర్చుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదు
భాషా విధానాల్లో హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదని, నచ్చిన భాషలు పెంచుకోవచ్చు అన్నారు. నేను త్రిభాషా విధానంలోనే ఎదిగా అన్నారు పవన్ కళ్యాణ్. తనకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలుసు అన్నారు. తాను హిందీ భాష నేర్చుకున్నాక తెలుగుకు మరింత దగ్గర అయ్యానని తెలిపారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తుంటారు. త్రిభాషా విధానం అంటే వాళ్ళు భాషలు నేర్చుకునేందుకు అవకాశమే కానీ, ఏ భాషను బలవంతంగా రుద్దడం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
డీలిమిటేషన్‌పై రాద్దాంతం వద్దు..
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు అంటూ చెన్నైలో ఇటీవల జరిగిన సదస్సుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సమస్యపై మొదటగా పార్లమెంట్లో గళం విప్పాలి. ఆ తర్వాతే పోరాటం చేయాలని సూచించారు. ఇలా రోడ్లమీదకు వస్తే ఏ ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడాన్ని అంగీకరించకూడదు అన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనతో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని, తమిళనాడులో బిజెపి పుంజుకుంటుందా అనే ప్రశ్నకు అలా బదులిచ్చారు.