CI Nagaraju Arrested in Sai Krishna Missing Case | విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సీబీఐ (CBI)కి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్ పై బుధవారం (జూన్ 24న) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు కీలక వివరాలను వెల్లడించారు. ఈ కేసును అత్యంత నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ఆయన ధర్మాసనానికి వెల్లడించారు.
కేసు దర్యాప్తు సక్రమంగా, పారదర్శకంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని ఏజీ వివరించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును సైతం పోలీసులు అరెస్ట్ చేశారని, నేడు ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తామని కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ‘ఏం చేస్తారో వేచి చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. కేసు సీబీఐకి అప్పగింతపై తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.
సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు విచారణ పూర్తివిజయవాడలో కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో మంగళవారం అరెస్ట్ అయిన సీఐ నాగరాజును ప్రత్యేక విచారణ బృందం (SIT) విచారించింది. తాజాగా ఆయనపై సిట్ విచారణ ముగియడంతో, పోలీసులు తదుపరి చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే సీఐ నాగరాజును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వాస్పత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం పోలీసులు మాజీ సీఐ నాగరాజును విజయవాడలోని రెండవ ఏజేఎస్ (2nd AJS) కోర్టులో హాజరుపరచనున్నారు.
మరోవైపు సీఐ నాగరాజుకు స్థానికంగా మద్దతు లభిస్తోంది. ఆయన ఏ తప్పు చేయలేదని, ప్రజల కోసం పనిచేసే పోలీస్ అని మహిళలు, యువత పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలో పాల్గొన్నారు. మంగళవారం అరెస్ట్ సమయంలో సైతం సిట్ అధికారులకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సీఐ నాగరాజును అరెస్ట్ చేసి సిట్ ఆఫీసుకు తరలించారు. నేడు విచారణ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని కోర్టులో నాగరాజును హాజరుపరచనున్నారు.
ఇదివరకే కుటుంసభ్యులను విచారించిన సిట్ అధికారులు
సాయికృష్ణ అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. సిట్ సభ్యులు సోమవారం (జూన్ 22న) కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసం, పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశానవాటికలను పరిశీలించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీతో పాటు మేనమామలు, కుటుంబ సభ్యులను సుమారు 6 గంటల పాటు విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. సాయికృష్ణను కృష్ణలంక స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆధారాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారని తల్లి, కుటుంబ సభ్యులు సిట్‌కు తెలిపారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందంతో కలిసి కృష్ణలంక పీఎస్ కు వెళ్లి తనిఖీ చేశారు. సిబ్బంది స్టేట్‌మెంట్లు, వేలిముద్రలను సేకరించారు. శ్మశానవాటిక వద్దకు వెళ్లి అక్కడి కాపరిని కూడా విచారించి, పరిసరాల్లోని సీసీ కెమెరాల వివరాలను ఆరా తీశారు.
