Vijayawada Sai Krishna Case | విజయవాడ: సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయమే సిట్ అధికారులు విజయవాడలోని సీఐ నాగరాజు ఇంటికి వెళ్లారు. అయితే సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆయన మద్దతుదారులు ఉదయం నుంచి ఇంటి వద్ద ఆందోళకు దిగారు. అయితే పోలీసు సాయంతో సిట్ అధికారులు సీఐ నాగరాజును నివాసంలోకి అతికష్టం మీద వెళ్లారు. కేసు విషయమై కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సిట్ అధికారులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడికి తీసుకెళ్లి సాయికృష్ణను కస్టడీకి ఎప్పుడు తీసుకున్నారు, ఏం జరిగిందని సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు.

Continues below advertisement

నాగరాజును అదుపులోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ముందుగానే వాహనం సిద్ధం చేసుకుని రావడంతో సీఐకి మద్దతుగా భారీ ఎత్తున స్థానికులు, మద్దతుదారులు వచ్చారు. నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అదుపులోకి తీసుకుంటారేమోనని గత మూడు రోజులుగా మాజీ సీఐ ఇంటి వద్దకు మద్దతుదారులు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ సైతం నిర్వహించడం తెలిసిందే. ఆయన వల్లే ఏరియాలో మహిళలు ధైర్యంగా బయట తిరుగుతున్నారని, సీఐ నాగరాజు వచ్చాకే పరిస్థితిలో చాలా మార్పుల వచ్చిందన్నారు. 

సోమవారం సాయికృష్ణ కుటుంబసభ్యులను ప్రశ్నించిన సిట్సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. సిట్ సభ్యులు సోమవారం (జూన్ 22న) కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసం, పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశానవాటికలను స్వయంగా పరిశీలించారు. సాయికృష్ణ తల్లితో పాటు మేనమామలు, కుటుంబ సభ్యులను సుమారు 6 గంటల పాటు విచారించి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పోలీసులు సాయికృష్ణను స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆధారాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారని కుటుంబ సభ్యులు సిట్‌కు తెలిపారు.

Continues below advertisement

Also Read: Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?

అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందంతో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సిట్ అధికారులు ఆమూలాగ్రం తనిఖీ చేశారు. సిబ్బంది స్టేట్‌మెంట్లు, వేలిముద్రలను సిట్ అధికారులు సేకరించారు. శ్మశానవాటిక వద్ద కాపరిని కూడా విచారించి, పరిసరాల్లోని సీసీ కెమెరాల వివరాలను ఆరా తీశారు.

సీసీటీవీ ఫుటేజీలు మాయం కావడంతో ఉత్కంఠ..అయితే, సాయికృష్ణ కేసులో అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలు మాయమవడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 18 నెలల ఫుటేజీ భద్రపరచాల్సి ఉండగా, దాదాపు ఏడాది కాలపు దృశ్యాలను తొలగించినట్లు సిట్ గుర్తించింది. కోర్టు ఆదేశాల ప్రకారం హార్డ్ డిస్క్, డీవీఆర్‌లను సీజ్ చేసి పరిశీలించగా.. కేవలం 2 రోజుల ఫుటేజీ మాత్రమే లభ్యమైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు మాజీ సీఐ నాగరాజు స్థానిక టెక్నీషియన్‌తో ఈ వీడియోలను తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిట్ అదికారులు డేటా రికవరీ కోసం ఈ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

సిట్ సభ్యులు వీరే..

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ ఎం.రవిప్రకాశ్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్‌.సుధాకర్‌లను సిట్ సభ్యులుగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అదేరోజు సీఐ నాగరాజును అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగగా, ఆయనకు మద్దతుగా రాత్రిపూట కొందరు మహిళలు స్థానికంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.