గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టీడీపీ అభిమాని వెంకాయమ్మ, ఆమె కొడుకుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో దుమారం రేగుతోంది. దీంతో ఆ గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను తాడికొండ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు. బాధితురాలైన వెంకాయమ్మను పరామర్శించడానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు కూడా అక్కడికి వెళ్లారు. దీంతో నక్కా ఆనంద బాబుపై కూడా దాడి చేసేందుకు వైసీపీ కార్యకర్తలు వచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ‘‘వైసీపీ రౌడీ షీటర్లు వచ్చి అల్లర్లు చేస్తున్నారు. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు.  వెంకాయమ్మపై దాడి చేసిన పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. పోలీసు అధికారులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు. దాడులు చేసిన వారిపై కేసులు వేస్తాం. మానవ హక్కులు, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేం ఏనాడు చూడలేదు.’’ అని మాట్లాడారు.


డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ చేస్తున్న తప్పులు ఎత్తిచూపితే దాడులు చేయడం పరిపాటి మారిందని అన్నారు. విమర్శించేవారిని భయపెట్టాలని చూస్తున్నారన్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పోలీసుల సహకారంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వెంకాయమ్మ కుమారుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని, వారి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీని చంద్రబాబు కోరారు.


ఛలో కంతేరుకు చంద్రబాబు పిలుపు
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంకాయమ్మను ఫోన్లో పరామర్శించారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ‘‘ఛలో కంతేరు’’కు పిలుపునిచ్చారు. దీంతో రేపు (జూన్ 12) టీడీపీ దళిత నేతలు గుంటూరు జిల్లా కంతేరు గ్రామానికి వెళ్లనున్నారు.


వెంకాయమ్మపై దాడి ఎందుకు జరిగిందంటే..
కంతేరు గ్రామానికి చెందిన కె.వెంకాయమ్మకు నాలుగున్నర సెంట్ల భూమి ఉంది. అందులో మూడున్నర సెంట్లు ఆక్రమణకు గురైందని, న్యాయం కోసం ఆమె తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మే 16న గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలోనూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్‌ పరిపాలనపై ఆగ్రహం వెళ్లగక్కారు. తనకు జగన్‌ పింఛను కూడా కట్‌ చేశారని, కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశారని ఆక్రోశించారు.


వెంకాయమ్మకు డయాలసిస్‌, టీబీ సమస్యలు ఉన్నాయి. ఇంజక్షన్‌ తీసుకోవడానికి సోమవారం సాయంత్రం తన అన్న ఇంటికి వెళ్లింది. దీంతో వెంకాయమ్మ భయపడి ఇంటికి తాళం వేసి ఊరు వదలి పోయిందని ఆ గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేశారు. ఆ విషయం తెలుసుకుని ఆమె రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చారు. ఇంతలోనే అక్కడకు  వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు పగలగొట్టారు. దాడి చేసి గాయపరిచారు. తాడికొండ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఈ వివరాలు పేర్కొన్నారు.