Chandrababu Condemns Stone Attack: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై శనివారం (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాయి దాడి ఘటనపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేయాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా విచారణకు ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చంద్రబాబు ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.






అయితే, చంద్రబాబు ఇలా స్పందించిన తీరు చాలా హూందాగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైసీపీ మద్దతుదారులు కొంత మంది చంద్రబాబు స్పందించిన తీరును ప్రశంసిస్తూ కామెంట్లు కూడా చేశారు.






ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఏప్రిల్ 13 శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగ్‌నగర్‌లో రాయి దాడి ఘటన జరిగింది. అప్పుడు జగన్ బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. బస్సు యాత్ర ఆ సమయంలో స్థానిక గంగానమ్మ గుడి దగ్గర సాగుతోంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతం అంతా కరెంటు పోయింది. 


అదే సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన జరిగింది. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి గాయాలు అయ్యాయి. సీఎం సహా వెల్లంపల్లికి డాక్టర్లు అప్పటికప్పుడే ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ప్రచారం యథాతథంగా కొనసాగింది. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి మేమంతా సిద్ధం యాత్ర ముగిసింది.


ప్రభుత్వ ఆస్పత్రికి జగన్
అనంతరం జగన్ సతీమణి భారతీ రెడ్డి అక్కడకు చేరుకుని.. ఇద్దరూ కలిసి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ కేసరపల్లిలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. విజయవాడ ఆస్పత్రిలో సీఎం జగన్‌ కు దెబ్బ తగిలిన కనుబొమ్మ పైన రెండు కుట్లు వేసినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. గాయం వల్ల ప్రమాదం ఏమీ లేదు. వాపు వచ్చిందని తెలిపారు.