Chandrababu Chandi Yagam Closed : టీడీపీ అధినేత చంద్రబాబు (Tdp Chief Chandrababu) నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న యాగక్రతువు ముగిసింది. ఈ నెల 22 నుంచి ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు దంపతులు మహా చండీ యాగం ( Maha Chandi Yagam), సుదర్శన నారసింహ హోమం (Sudarshana Narasimha Homam) చేస్తున్నారు. ఇవాళ్టీతో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీ యాగం ముగిసింది. పూర్ణాహుతిలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, వారి కుటుంబసభ్యులు  పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో గుంటూరుకు చెందిన వేదపండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40మంది రుత్వికులు, మహా చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేయించారు.


స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి, జైలు నుంచి  విడుదలైన చంద్రబాబు...వరుసగా దేవాలయాలను సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి, బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న స్వామి వారిని దర్శించుకున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుండటంతో ముందుగానే ఆలయాల బాట పట్టారు. నోటిఫికేషన్ వస్తే ప్రచారం, వ్యూహాల్లో మునిగిపోవాల్సి ఉండటంతో ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియడంతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో చంద్రబాబు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్...అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయనున్నారు.