బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
జులై నాటికి పనులు పూర్తి...
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో వేల కోట్ల రూపాయల విలువైన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా రూ.268 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. అయితే స్మృతివనం లో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
ఇది కాకుండా పురపాలక శాఖ కూడా మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని ఈ లెక్కన ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈపనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ, హర్యానాలో విగ్రహం అదే ఎత్తులో..
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం హర్యానా, తెలంగాణలో జరుగుతుండగా ఏపీలోని పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో అంతే ఎత్తులో స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహం పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి స్మృతివనం పనులను పూర్తి చేయాలనుకున్నా అనివార్యకారణాలతో జూలై నాటికి స్మృతివనం పనులను పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, సందర్శకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా..
స్మృతివనంలో భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణపనులను వేగవంతం చేయాలని, మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని మంత్రి నాగార్జున సూచించారు. అంబేద్కర్ విగ్రహ శిల్పి నరేష్ విగ్రహ నిర్మాణపనుల పురోగతిని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్మృతివనంలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్ తరాలకు కన్వెన్షన్ సెంటర్ ద్వారా అంబేద్కర్ సామాజిక అంశాలను ప్రచారం చేయనున్నట్లు మంత్రి నాగార్జున వెల్లడించారు.