Andhra Pradesh News: తెలంగాణ బీసీ నాయకుడు అర్‌.కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున ఎన్నిక కానున్నారు. మంగళవారం కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ నుంచే నుంచే వైసీపీ తరఫున పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. 


ముగ్గురు వైసీపీ నేతల రాజీనామాతో ఎన్నికలు


వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ మధ్య కాలంలో రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఐదు రోజు వారం రోజుల క్రితమే నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారంతో గడువు ముగియనుంది. నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఈ మూడు స్థానాలకు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారనే చర్చ నడిచింది. ఈ సీట్లపై కూటమి పార్టీల మధ్య చర్చలు ఎప్పుడో ముగిశాయని అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు అయినట్టు వార్తలు వచ్చాయి. 


ఆర్‌ కృష్ణయ్యకు మరో ఛాన్స్ 


వైసీపీ నుంచి గెలుపొందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, అర్‌.కృష్ణయ్య ఆపార్టీ సభ్యత్వంతోపాటు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఈ కారణంగా ఖాళీ అయిన స్థానాల్లో రెండు స్థానాల కాలపరిమితి నాలుగేళ్లు ఉంది. మరో స్థానానికి కాలపరిమితి కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది. అందుకే ఈ స్థానం నుంచి బీజేపీ ఆర్‌ కృష్ణయ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది. ఇప్పుడు ఆయన మరోసారి పెద్దల సభలో కూర్చోనున్నారు. ఇప్పటి వరకు కృష్ణయ్య బీజేపీలో చేరలేదు. 


Also Read: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు


దేశవ్యాప్తంగా ముగ్గురికి ఛాన్స్ 


ఆర్‌ కృష్ణయ్యతోపాటు వేర్వేరు రాష్ట్రాల నుంచి మరో ఇద్దర్ని రాజ్యసభకు బీజేపీ పంపిస్తోంది. హర్యానా నుంచి రేఖా శర్మను ఒడిశా నుంచి సుజీత్‌ కుమార్‌ను పెద్దలకు పంపిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన లిస్ట్‌ను సోషల్ మీడియాలో బీజేపీ పోస్టు చేసింది.


టీడీపీలో తీవ్రమైన పోటీ


ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు స్థానాల్లో ఒకటి ఖరారు అయింది. టీడీపీ తీసుకున్న రెండింటికి కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీద మస్తాన్‌రావును మరోసారి రాజ్యసభకు పంపించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో స్థానంలో సానా సతీష్ పేరు ఖరారు అయినట్టు టాక్ నడుస్తోంది. మరి కాసేపట్లో దీనిపై స్పష్టత రానుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు ఎంపీ స్థానాలకు డిసెంబర్‌ 3న నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇంకా నామినేషన్లకు ఒక్కరోజే టైం ఉంది. ఇప్పుడు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇంకా టీడీపీ కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించనుంది. పోటీగా నామినేషన్లు పడితే 20వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. లేకుంటే ముగ్గురూ ఏకగ్రీవం కానున్నారు. వైసీపీకి అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం లేనందున ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండనుంది. 


Also Read: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!