విజయవాడ: వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన బుద్దా వెంకన్న సహా టీడీపీ నేతలు వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  


విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ‘విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోతే ఖబడ్దార్. సాయిరెడ్డికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా మనిషిలాగ మాట్లాడాలి. సీనియర్ నేతను పట్టుకుని అన్ని మాటలు ఎలా మాట్లాడతావు. చంద్రబాబు బతికి ఉంటే.. తాం అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అంటావా? అంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే, బెదిరిస్తే భయపడిపోవాలా. ’


కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారు..
‘కాకినాడ పోర్టును వైసీపీ హయాంలో వైఎస్ జగన్ బలవంతంగా  లాక్కున్నారనేది వాస్తవం కాదా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరు అని అందరికీ తెలుసు. కేవీ రావు వద్ద నుంచి మీరు ఎలా తీసుకున్నారో చెప్పగలరా అన్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్ హయాంలో వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు అన్నారు. ‘వైసీపీ హయాంలో బాధితులు ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి పోలీసులకు, కలెక్టర్లకు, సంబంధిత ఫిర్యాదులు చేస్తున్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా  పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కులాన్ని అంటగట్టడ దారుణం. ఈ విషయంలో జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? ఎవరైనా వైసీపీ హయాంలో జరిగిన తప్పులు, మీ పాపాలను ఎత్తి చూపితే.. కులం పేరుతో కుట్రలు చేయడం సరికాదు. చంద్రబాబు లాంటి వ్యక్తి వార్నింగ్ ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావా విజయసాయిరెడ్డి. చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు జాగ్రత్త. 


గతంలో ట్విట్టర్ ఎక్స్ లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు.. ఇలాంటి వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట. మీ ప్రభుత్వం వస్తే లోపలేస్తాం అని అంటే, చంపుతామని వార్నింగ్ ఇస్తున్నట్లు అనుకోవాలా? నీలాంటోడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబును బెదిరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలి. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం.’ 


అసలు నీకు పరువు ఉందా? పరువు నష్టం దావా ఎలా వేస్తావు


‘పరువు నష్టం దావా వేయడానికి అసలు విజయసాయిరెడ్డికి పరువు ఉందా? దమ్ముంటే నాపై పరువు నష్టం దావా వేయి. చూసుకుందాం. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బాధితులే బయటకు వచ్చి జగన్ పై, వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటే అసహనంతో నోరు పారేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి గతంలో విశాఖలో మీడియా ప్రతినిధులను బూతులు తిట్టారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ వేదికగా మాట్లాడుతున్నాడు.’ 



పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు


‘చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే న్యాయస్థానానికి వెళ్లి  పోరాటం చేస్తాం. ఇక నుంచి ఏం వాగినా విజయసాయిరెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. విజయవాడ సీపీ నా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. పోలీసులు తీసుకునే చర్యలను బట్టి త్వరలోనే న్యాయనిపుణలను సంప్రదించి, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి శిక్ష పడేలా చేస్తామని’ బుద్ధా వెంకన్న తెలిపారు. 



Also Read: Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?