Konaseema District Name Change: కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్‌ మీద అంతగా చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా కదా అని ప్రశ్నించారు. బుధవారం జీవీఎల్ నరసింహారావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లు, హింసకు బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఇలాంటి విధ్వంసకర చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని అన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ పేరుపై వైసీపీ ప్రభుత్వమే వివాదం రేపిందని మండిపడ్డారు. దేశ ప్రజలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. గుంటూరులో జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్టు చేశారని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.


అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆందోళనకారులను గుర్తించే పనిలో విశాల్ గున్ని ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ కసరత్తు చేస్తోంది. అందుకోసం సీసీటీవీ కెమెరాలు, ఇతర వీడియోలను పరిశీలిస్తున్నారు. ఇక, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లకు నిప్పు పెట్టడం, కలెక్టరేట్ దగ్గర విధ్వంసం సృష్టించిన వారిని ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. 


46 మందిని అదుపులోకి : డీఐజీ ప్రకటన



అమలాపురంలో అమలవుతున్న కర్ఫ్యూ ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పందించారు. ‘‘వేరే జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకురావటమే లక్ష్యం. సీసీ ఫుటజ్ లు పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకూ 46మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టాం. పేరు మార్పు అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులతో మాట్లాడాం. వాళ్ళు తమ తరపు నుంచి శాంతిపూర్వక హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి అందుకే కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం లేదు. కానీ అన్ని చోట్ల పోలీసు నిఘా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని అన్నారు.



ప్రధానంగా ఈ అన్ని ఘటనలలో ఒకే టీం పాల్గొనట్లు పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన వారిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.