AP News: విధి ఎప్పుడు ఎవరిని వెక్కిరిస్తుందో తెలియదు. అప్పటివరకూ అంతా బాగానే ఉందనుకున్న చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఓ కుటుంబానికి ఇలాంటి సమస్యే వచ్చి పడింది. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతడి జీవితంలో రోడ్డు ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. ఇంటి పెద్దకు కాళ్లు, చేతులు విరగడంతో చికిత్స కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు. బతుకే భారంగా మారిపోయింది. పూట గడవడమే కష్టంగా తోస్తోంది. కనీసం ప్రభుత్వం ఇచ్చే పింఛన్ వచ్చినా పిల్లల కడుపు నింపచ్చని భావించిన ఆ వ్యక్తి... పింఛన్ కోసం ఏడాది కాలంగా తిరుగుతూనే ఉన్నాడు. సదరమ్ సర్టిఫికేట్ లో 77 శాతం వికలాంగుడు అని వైద్యులు ధ్రువీకరణ చేసినప్పటికీ.. విద్యుత్ బిల్లు ఎక్కువని, ఇతర కారణాలు చెబుతూ పింఛన్ ఇవ్వట్లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని అతడు కన్నీరు పెడుతున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలం పైడూరిపాడుకు చెందిన శ్రీరామకోటేశ్వర రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెల్గిండ్ కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు గూని కూడా జారిపోయింది. వైద్య చికిత్సలు నిమిత్తం విజయవాడ, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు అతడి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లారు. నాలుగు సార్లు అతడికి వైద్యులు ఆపరేషన్లు కూడా చేశారు. ఇందుకోసం అతడి కుటుంబ సభ్యులు సుమారు పదిన్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాగే డబ్బులు లేక ఉన్న ఒక్క ఇళ్లును కూడా అమ్మేశారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా అతడి కాళ్లు మెరుగు పడలేదు. కనీసం నడవడానికి కూడా లేకుండా పోయింది. మందుల కోసం నెలకు సుమారు 5 వేల ఖర్చు కూడా వస్తోంది. ఇది చాలదన్నట్లు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి. కుటుంబ పోషణ భారంగా ఉన్న వీళ్లకు ఆస్పత్రి ఖర్చులు మరింత ఎక్కువ అయ్యాయి.


పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్న రామకోటేశ్వర రావు


గతేడాది శిబిరంలో 77 శాతం వికలాంగుడు అని ధ్రువీకరణ చేశారు. అప్పటి నుంచి అతడు వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాడు. ఏడాది నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తొలుత కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తిరస్కరించారు. ఇప్పుడేమో రకరకాల కారణాలు చూపుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే.. కలెక్టరేట్ లోని స్పందనలో ఫిర్యాదు చేయమన్నారని బాధితుడు తెలిపారు. ఇలా తిప్పుతూనే ఉన్నారు తప్పితే పింఛన్ మాత్రం రావడం లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రామకోటేశ్వర రావు కోరుతున్నాడు.