గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి నూతనోత్తేజం వచ్చిందని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఆర్కే రోజా అన్నారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో రూ.21,941 కోట్లతో 123 ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు.
మంత్రి రోజా సమీక్ష...
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖలపై విజయవాడ బెర్మ్ పార్క్ లో అధికారులతో మంత్రి రోజా మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. జీఐఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంటే ఏంటో పారిశ్రామికవేత్తలకు తెలిసిందని, అందుకే టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో రూ.21,941 కోట్లతో 123 ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. దీని ద్వారా 41,412 మంది రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జరిగిన ఎంఓయూల్లో 40 డీపీఆర్ లు ఇప్పటికే సబ్మిట్ చేశామన్నారు. పెట్టుబడులకు ముందుకు వచ్చినవారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పర్యాటకులు వచ్చారని తెలిపారు.
మంత్రిగా ఏడాది.. కేక్ కట్ చేసిన రోజా..
ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. ఈ సందర్బంగా అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. సంవత్సరకాలంలో చరిత్రలో ఎప్పుడూ, ఎన్నడూ లేనివిధంగా పర్యాటక, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం, శ్రీశైలం మల్లన్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోవడం, ఆ కార్యక్రమాల్లో తాను పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. క్రీడాకారులు, కళాకారుల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని.. పర్యాటక రంగంలో ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం జగనన్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందన్నారు.
రికార్డు స్థాయిలో టర్నోవర్..
రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది ఏపీటీడీసీ రికార్డు స్థాయిలో రూ.163.25 కోట్ల టర్నోవర్ సాధించిందని మంత్రి రోజా తెలిపారు. 2021-22లో రూ.147.35 కోట్ల టర్నోవర్ సాధిస్తే.. ఈ ఏడాది 10.82 శాతం ఎక్కువ వచ్చిందన్నారు. కళాకారుల, క్రీడాకారుల ఉన్నతి కోసం 26 జిల్లాలకు చెందిన ఔత్సాహికులతో 4 డివిజన్లలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జగనన్న సాంస్కృతిక సంబరాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల ఫ్రైజ్ మనీతో కళాకారులను గౌరవించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సదస్సుల్లో కళాకారులచే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు.
క్రీడాకారులను కూడా ప్రోత్సహించేలా క్రీడా సంబరాలు నిర్వహించామని వారికి కూడా రూ.50 లక్షల ఫ్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్రీడా పోటీల్లో ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 15 నుంచి శాప్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. యూత్ ఫెస్టివల్స్ వల్ల యువతకు తగిన ప్రోత్సాహం లభించడంతో పాటు సరైన మార్గంలో నడిచేందుకు దోహదం చేస్తాయన్నారు. జగనన్న ప్రభుత్వంలో అన్ని కాలేజీల్లో, స్కూళ్లలో ఈవ్ టీజింగ్ పూర్తిగా అరికట్టారని.. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారన్నారు.
ఒబెరాయ్ గ్రూప్ ద్వారా పీపీపీ విధానంలో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, హార్సిలీ హిల్స్, గండికోటలో రూ.1350 కోట్ల అంచనా వ్యయంతో 7 స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీనిద్వారా 10,900 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖపట్నం, తిరుపతికి సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్‌లు పూర్తయ్యాయని..మిగిలినవి వీలైనంత త్వరగా అగ్రిమెంట్లు చేసుకుని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో జల, సాహస క్రీడలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన మొత్తం లొకేషన్లలో తొలి దశలో 21 ప్రాంతాల్లో జల, సాహస క్రీడలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్పార్క్ సైబర్ టెక్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 100 టూరిస్టు ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటకుల భద్రతే లక్ష్యంగా రాష్ట్రంలో 50 ప్రాంతాల్లో పర్యాటక విడిది భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెల 29న వరల్డ్ డాన్స్ డే సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడతామని.. ఆ రోజున ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సంక్రాంతి, ఉగాది వంటి పండుగ దినాల్లో ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా రాష్ట్రంలో పర్యటించేలా దానికనుగుణంగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఇప్పటికే టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కేంద్రప్రసాద్ పథకం కింద సింహాచలం ఆలయ అభివృద్ధికి రూ.54.04 కోట్లు, అన్నవరం దేవాలయ అభివృద్ధికి రూ.54.17 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. డీపీఆర్, టెండర్లు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. తిరుపతి టెంపుల్ టూరిజంతో పాటు విశాఖలో నేచురల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు ఇతర రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారన్నారు.