Group-1 News : హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 2018 గ్రూప్ వన్ మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటి వరకు ఎంపికైన ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదపరి విచారణ వారానికి వాయిదా వేసింది.
2018 గ్రూప్-1 కింద 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడు సార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకేసారి మాత్రమే మాన్యువల్‌గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరు వర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో ఆందోళన మొదలైంది. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరుతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్‌కు ఏపీపీఎస్సీ సమర్పించింది. వాటిని పరిశీలించిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 27కి వాయిదా వేసింది.
ఏపీలో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి 2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. వీటి ఫలితాలను వెల్లడించి, ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేసింది. తాజాగా హైకోర్టు సింగిల్ బెంచ్ మెయిన్స్ పరీక్ష రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఊరట లభించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో అభ్యర్థులకి కూడా ఊరట లభించినట్లైంది.