Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఓవైపు ఎండ దంచికొడుతున్నా... రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతోంది. ఇవాళ కూడా ఏపీలో తేలిపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  (ఐఎండీ) తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసాయని అంచనా వేస్తోంది. వర్షాలే కాదు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వర్షం పడే సమయంలో చెట్లు,  స్తంభాల దగ్గర ఆగొద్దని సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.


బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు.. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి  ప్రభావంతో నిన్న (బుధవారం) కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. మరోవైపు పశ్చిమ విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ... ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.


నిన్న (బుధవారం) కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాజాంలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడలోని చొల్లంగిలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం, కాకినాడలోని జగ్గంపేటలో 5.2 సెంటీమీటర్ల వర్షం, అనకాపల్లిలోని కొత్తకోటలో 4.7 సెంటీమీటర్లు, కాకినాడలోని కిర్లంపూడి లో 3.5 సెంటీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం లో 3.4 సెంటీమీటర్లు, విశాఖపట్నంలోని పెదగంట్యాడలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్‌ అయ్యింది.


ఉత్తర కోస్తాంధ్రలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. అలాగే... భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... ఇవాళ (గురువారం) రాయలసీమలో మాత్రం ఎండల మండతాయి. వేడితోపాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఉత్తర కోస్తా, కోస్తాంధ్రలో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా ఒకట్రెండు చోట్ల మాత్రమే. అయితే పిడుగులు పడే అవకాశం ఉండటంతో... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం... వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది. అలాగే.. పంటల విషయంలో  రైతులు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.