Vijayawada Metro Latest News: విజయవాడ వాసులకు ఎప్పటి నుంచో కలగా ఉంటున్న మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు పడుతోంది. భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టారు. గన్నవరం, పెనమలూరు అధికారులు పర్యటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఆ నగరం పూర్తి అయితే దాని ప్రభావం విజయవాడపై పడనుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోనుంది. అందుకే ముందు జాగ్రత్తగా అక్కడ మెట్రో ప్రతిపాదన తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే దీనికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగా మరో అడుగు ముందుకేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు మెట్రో నడిచే ప్రాంతాల్లో భూసేకరణకు చర్యలు చేపడుతున్నారు. 

గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో అధికారు పర్యటించారు. గన్నవరం, కేసరపల్లిలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులతో కలిసి విజయవాడ మెట్రో చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ జీపీ.రంగారావు విజిట్ చేశారు. బస్టాండ్, హెచ్‌సీఎల్‌, కేసరపల్లి కూడలిలో 12:42 మీటర్ల నిష్పత్తితో మెట్రోను నిర్మించనున్నారు. దీనికి అవసరమైన భూసేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 

విజయవాడ మెట్రో ప్రాజెక్టును మొదటి దశలో రెండు కారిడార్‌లతో పూర్తి చేయానున్నారు. మొదటి కారిడార్‌ను 26 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. ఇది పీఎన్‌బీఎస్(పండింట్‌ నెహ్రూ బస్‌స్టేషన్) నుంచి గన్నవరం వరకు ఉండబోతోంది. రెండోది పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు ఉంటుంది. దీని పొడవు 12.4 కిలోమీటర్లు. మొత్తం 38.4 కిలోమీటర్ల మెట్రోప్రాజెక్టును 34 స్టేషన్లతో ఏర్పాటు చేయనున్నారు. 

రెండో దశలో  27.75 కిలోమీటర్లు విస్తరించనున్నారు. మొత్తంంగా రెండు దశలు కలుపుకుంటే 66.15 నిడివితో విజయవాడ మెట్రోను పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 11వేల 9 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ దశలో భూసేకరణ 1152 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం 91 ఎకరాలు సేకరించాలనే ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపించారు. దీన్ని వేగవంతం చేసేందుకు అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. 

కృష్ణా జిల్లాలో 70.95 ఎకరాలు,  ఎన్టీఆర్ జిల్లాలో 11.71 ఎకరాలు సేకరించనున్నారు. ఈ భూముల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు  చెందిన భూమలు కూడా ఉన్నాయి. రైల్వే శాఖకు చెందిన భూమి ఎకరాకుపైగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి దాదాపు ఐదు ఎకరాల వరకు ఉంది. మిగతా 75 ఎకరాలకుపైగా భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. 

ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి అయితే విజయవాడ రూపురేఖలు మారిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్రంతో చర్చించి డీపీఆర్‌ను ఒప్పించుకుంది. ఇప్పుడు భూసేకరణకు సంబంధించిన అడ్డంకులను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

ఈ మెట్రో ప్రాజెక్టును చాలా భిన్నంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైవే గుండా నిర్మిస్తున్నందున వాహనాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. అందుకే దీన్ని డబుల్ లేయర్ మెట్రో నిర్మించనున్నారు. ఫ్లైఓవర్ మీదుగా మెట్రో ట్రాక్ వేస్తారు. రామవరప్పాడు వద్ద ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానిపై మరో ఫ్లై ఓవర్ ఉంటుంది. దానిపై మెట్రో లైన్ వస్తుంది. భిన్నంగా ఉండే ఈ మెట్రోతోపాటు విశాఖలో నిర్మించనున్న మెట్రో కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల కోసం 42,362 కోట్లు ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకుంది.