విజయవాడ: పరిపాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే.. పాలకులు ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల వైసీపీ పాలన ఒక కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ అని, ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు చెల్లవని స్పష్టం చేశారు. రాజ్యాంగ మూలాలను ఎవరూ విస్మరించకూడదని అన్నారు. కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న చంద్రబాబు తెలుగు ప్రజానీకం కోసం అహర్నిశలు పాటుపడతానని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు.
దేశంలో అతిపెద్ద చీకటి రోజు1975 జూన్ 25న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. దేశంలో అతిపెద్ద చీకటి రోజు ఎమర్జెన్సీ. భారత రాజ్యాంగం, ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాస్తూ 21 నెలలు దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. ఇది తప్పు అని చెప్పిన వాళ్లను జైల్లో పెట్టారు. నియంత్రృత ధోరణిలో వెళ్లి న్యాయ వ్యవస్థలను కబళించారు. 1975 జూన్ 12న ఎన్నిక చెల్లదని అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చినా... దీనిపై సుప్రీంకోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చని చెప్పింది. ప్రజల వద్దకు వెళ్లి మరోసారి ప్రధాని కావచ్చని చెప్పినా ఎమర్జెన్సీ ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్‌కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి వారితో పాటు ఎందరినో జైళ్లలో పెట్టారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్తే మెజారిటీ లేకున్నా వేరే నేతను సీఎం చేశారు. 30వ రోజునే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. ఇది ప్రజాస్వామ్య విజయం.
వైసీపీ హయాంలో నియంతృత్వ పాలనవైసీపీ ఐదేళ్ల పాలన నియంతృత్వ పాలనే. రాష్ట్ర ప్రజల్లాగే నేను కూడా బాధితుణ్ణే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ఇలాంటి పాలన చూడలేదు. ఎవరు గొంతు విప్పినా నులిమేశారు. రౌడీయిజం, మోసాలు, కేసులు, బెదరింపులతో ఆస్తులు రాయించుకోవడం సహా ఎన్నో అరాచకాలు చేశారు. పాలన ఎలా ఉండకూడదంటే ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఏపీలో వైసీపీ పాలనను కేస్ స్టడీగా తీసుకోవాలి. కరోనా టైంలో కేవలం మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. పెళ్లి విషయంలో అటు ఇటు ఐదారు తరాలు చూస్తారు. కానీ ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే సమయంలో మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు. మీరు తుపాకీ చేతపట్టి యుద్ధం చేయాల్సిన పనిలేదు. మీకు ఓటు హక్కు ఇస్తున్నానని అంబేద్కర్ అన్నారు. ఓటు అనే ఆయుధం వాడి మంచి నేతల్ని ఎన్నుకుంటే బాగుపడతాం.
బీజేపీ, జనసేనతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు వేశాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు నడిపించడంలో తొలి అడుగు పడిందన్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనతో కలిసి వచ్చారు. ఈతరం వారికి ఎమర్జెన్సీ గురించి తెలియదు, చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 సాధిస్తామని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.