Sitaram Yechury: అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఇవాళ పార్టీ కార్యాలయానికి తీసుకురానున్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి జేఎన్‌యూకు తీసుకొచ్చారు. అక్కడ విద్యార్థులు, ప్రొఫెసర్స్‌ నివాళి అర్పించారు. అనంతరం వసంత్ కుంజ్‌లోని ఏచూరి నివాసానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం మృతదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కుతరలించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వచ్చి నివాళి అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే మృతదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం నాలుగు తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు.


ఏచూరి భౌతికఖాయం ఆయన నివాసంలో ఉండగానే సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నా ఆయనకు  టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీతారాం ఏచూరి నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు,అప్పల నాయుడు, కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, రవీంద్ర కుమార్ అంతా ఏచూరి పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.


Also Read: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?


సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు సీతారం ఏచూరి మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో చంద్రబాబు నేరుగా వెళ్లి సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రాత్రికి అక్కడే బస చేసి, ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు. 


దివికెగసిన ఎర్ర సూరీడు
వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దశాబ్దాలుగా పార్టీలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కమ్యూనిస్టుగానే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా కూడా ఆయన విస్తృత గుర్తింపు పొందారు. దాదాపు 50 ఏళ్ల సీపీఎం పాలన తర్వాత ఈ ఎర్రటి సూర్యుడు అస్తమించాడు. రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం కొనసాగారు. తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం ఏచూరి విద్యార్థి దశలోనే ఎడమవైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుతున్నప్పుడే సీపీఎంలో చేరారు. మరోవైపు బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. రావును తీసేసి సీతారాం గానే కొనసాగారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.


Also Read: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస