Andhra Pradesh Latest News: ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు ఇప్పుడు అందజేస్తున్న సాయం కంటే మరింత ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు ఏపీ గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ ప్రకటించింది. ఆ శాఖ మంత్రి దీనిపై ప్రత్యేక ప్రకటన చేశారు. 

బీసీలకు 50వేలు, ఎస్టీలకు 75వేల అదనపు సాయం 

మంత్రి పార్థసారథి విడుదల చేసిన ప్రకటన ప్రకారం గృహా నిర్మాణ శాఖ జి.ఓ.ఆర్టీ నెం.9ని మార్చి 10న జారీ చేసింది. అందులో పేర్కొన్నట్టు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు పివిటీజీలకు రూ.లక్ష రూపాయల అదనపు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.  

మహిళలకు ఉచిత ఇసుక, అదనంగా 35వేల సాయం 

పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0, పి.ఎం.జన్మన్ పథకాల కింద మంజూరు అయిన ఇళ్లకు ఈ జీవో ఆదేశాలు వర్తిస్తాయని మంత్రి పార్థ సారథి వెల్లడించారు. దీని తోడు ఎస్.హెచ్.జీ. సభ్యులకు జీరో వడ్డీపై రూ.35 వేల వరకు ఋణ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇసుక కూడా ఉచితంగా అందజేస్తారు. ఆ ఇసుక రవాణా కోసం రూ.15 వేలను కూడా రవాణా చార్జీల కింద అందజేస్తారని మంత్రి తెలిపారు. 

రూ. 1.80కి ఇప్పుడు ఇచ్చేది అదనం 

ఇప్పటి వరకు ప్రభుత్వం అందజేసే యూనిట్ కాస్టు రూ.1.80 లక్షలకు ఇది అదనంగా  అందే ఆర్థిక సహాయం అన్నమాట. స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047లో భాగంగా 2029 నాటికి "అందరికీ ఇళ్లు" అనే లక్ష్య సాధనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదల అందరికీ పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సకాలంలో సాధించాలనే కేంద్ర ప్రభుత్వ గృహా నిర్మాణ పథకాలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోనున్నట్టు ప్రకటించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు.  

జూన్‌ నాటికి మూడు లక్షల ఇళ్లు పూర్తి 

పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్)-1.0, పి.ఎం.జన్మన్ తదితర పథకాల కింద మంజూరు చేసి మొత్తం గృహాల్లో 1.25 లక్షలు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు  వీటిలో 3.00 లక్షల గృహాలను జూన్‌లోపు పూర్తి చేయనున్నామని వెల్లడించారు. మిగిలిన గృహాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతాయని తెలిపారు.  

పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-2.0, పిఎమ్ఏవై (గ్రామీణ్)-2.0, పి.ఎం.జన్మన్ తదితర పథకాల కింద మరో 5.00 లక్షల గృహాలు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద యూనిట్ కాస్టుగా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామన్నారు. ఈ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించే సర్వే కార్యక్రమం జరుగుతోందన్నారు. అర్హులైన లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవానలి విజ్ఞప్తి చేశారు.