JP Nadda in Vijayawada Meet: ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిపై సమష్ఠిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం విజయవాడలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు.
విజయవాడలో సమావేశం అవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని అన్నారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇదని అన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని, ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయని అన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం ఉండాలని అన్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని సూచించారు.
దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి చోట బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకొనే అంశంపై పని చేయాలని చెప్పారు. బూత్ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూడాలని నిర్దేశించారు. బీజేపీ అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పని చేయాల్సిన శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ నిధులతోనే ఆరోగ్య శ్రీ - జేపీ నడ్డా
ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని అమలు చేస్తోందని, దాన్ని ఆరోగ్య శ్రీ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ లాభం పొందుతోందని విమర్శించారు. అది జగన్ ప్రవేశపెట్టిన పథకం కాదని, నరేంద్ర మోదీ పెట్టిన పథకం అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ కేంద్రం నుంచి వైద్య సాయం అందుతున్న విషయాన్ని బీజేపీ కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పని చేస్తుందని, అదే ఆరోగ్య శ్రీ అయితే, రాష్ట్రం దాటితే పని చేయబోదని జేపీ నడ్డా అన్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఏటా రూ.6 వేలను రైతుల ఖాతాల్లో తామే వేస్తున్నామని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ముద్ర వేసుకొని చెలామణి అవుతున్నారని విమర్శించారు.
మన్ కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా ఇచ్చే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వినాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రధాని సందేశాన్ని అక్కడి ప్రజలతో చర్చించి వారికి చేరవేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఏపీ బీజేపీ ప్రత్యేక పుస్తకం విడుదల చేసిందని అన్నారు. అందులోని విషయాలను ప్రజలకు చేరవేయాలని నడ్డా కోరారు.