ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని.. అదో నరకంలా ఉందంటూ తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దీనిపై వైసీపీ లీడర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.


మంత్రి కేటీఆర్ కామెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ రోజా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిని చూపించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ వస్తారంటే తానే  స్వయంగా రాష్ట్రమంతా తిప్పుతానన్నారు రోజా. కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్రెండ్‌ను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్నట్టు రోజా తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసిన తర్వాత ఆమె ఈ కామెంట్స్ చేశారు. 


కేటీఆర్ ఏపీ గురించి మాట్లాడి ఉంటార‌ని తాను అనుకోవడం లేదన్నారు రోజా. పొరుగు రాష్ట్రాలు అని అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్‌ అని ఎక్కడా అనలేదు. ఒక‌వేళ ఆయ‌న ఏపీ గురించి అని ఉంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టూరిజం అండ్ యూత్ మినిస్ట‌ర్‌గా కేటీఆర్‌ని రాష్ట్రానికి సాధరంగా ఆహ్వానిస్తున్నా.. ఏపీకి రండి అన్నారు. జ‌గ‌న్‌ను దేశ‌మంతా ఆద‌ర్శంగా తీసుకుందని గుర్తు చేశారు. ఆయ‌న తీసుకువ‌చ్చిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను, విప్లవాత్మక మార్పుల‌ను దగ్గరుండి చూపిస్తానన్నారు. 


నాడు-నేడు ద్వారా  బ‌డులు, ఆస్పత్రుల‌ను ఏ విధంగా తీర్చిదిద్దారో చూపిస్తామన్నారు రోజా. రోడ్లు ఏ విధంగా వేశారో చూపిస్తామన్నారు. స‌చివాల‌య‌, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ ప‌థ‌కాలు, ప్రజ‌ల‌ గడప వద్దకే అందుతున్న సేవ‌ల‌ను చూపిస్తామన్నారు. కేటీఆర్ ఇవన్నీ చూసిన త‌ర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి విప్లవాత్మక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని అనుకుంటారని అభిప్రాయపడ్డారు రోజా. 


తాను మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రోజా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావుని ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం కేసిఆర్‌కు చిత్రపటాన్ని బహూకరించారు. రోజాకు  సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్దతిలో బొట్టుపెట్టి సత్కరించారు. 


కేటీఆర్ కామెంట్స్‌పై ఏపీ మంత్రులు అంతా స్పందించారు. ఇలాంటి కామెంట్స్ ఇరు రాష్ట్రాలకు మంచిది కాదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఇలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇలా మాట్లాడితేనే ఓట్లు వస్తాయని భావించి కేటీఆర్ అనుకొని ఉండవచ్చని అంటున్నారు. విద్యుత్ కోతలు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యని... మొన్నటి వరకు తెలంగాణలో కూడా పవర్ కట్స్ ఉన్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు 16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని... వాటితో పోలిస్తే తాము చాలా బెటర్ అన్నారు. సింగరేణి ఉన్న కారణంగా తెలంగాణలో తాత్కాలికంగా సమస్యల్లేకపోవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సమస్య అధిగమించేందుకు పవర్ కొంటున్నట్టు తెలిపారు పెద్దరెడ్డి.