అసభ్యకర వేధింపుల కేసులో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రజలకు ఏ కష్టం వచ్చినాసమస్య వచ్చిన వెంటనే గుర్తుకు వచ్చేది పోలీసు అని తెలిపారు. అలాంటి అపార నమ్మకం కలిగిన పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలంటే వారితో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారికి మేమున్నామని ధైర్యాన్ని వారిలో నింపినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పారు.

  


ప్రజల భద్రతకు కల్పించాల్సిన ప్రథమ బాధ్యత పోలీసులది. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించి, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినప్పుడే ఇది నెరవేరుతుంది. పోలీసు వ్యవస్థలో ఉండే ప్రతీ సిబ్బంది నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. అలా కాకుండా పోలీసు ప్రతిష్టను భ్రష్టు పట్టించేలా సిబ్బంది వ్యవహరిస్తే క్రమశిక్షణారాహిత్య చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. 


మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గంపలగూడెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్.వి. రామకృష్ణ సాండ్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొంత కాలంగా అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. విధుల పట్ల అలసత్వం వహించడమే కాక, ఆ ప్రాంతంలో మహిళ వీఆర్ఓ పట్ల, ఆమె తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఎస్పీ దృష్టికి వచ్చింది. ఆ కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు.  అంతేగాక అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 


ఈ సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు నివేదికను ఎస్పీ అందించారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయిన అనంతరం సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడమే కాక, ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించిన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా... అవి నిజమని నిర్ధారణ అయితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. 


Also Read: Kondapalli Mining Issue: కొండపల్లి తవ్వకాలపై రాజకీయ రగడ... నిజనిర్దారణకు వెళ్లే టీడీపీ నేతల గృహనిర్బంధం... దేవినేని ఉమ ఫ్యామిలీని పరామర్శించిన చంద్రబాబు