Guntur Latest News: గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ఐజక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు అధికారులు. బాలుడి కుటుంబానికి జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. 

గుంటూరు ఘటనతో మిగతా ప్రాంతాల్లో ఇలాంటివి రిపీట్ కాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి దీనిపై సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 4 నెలల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల వీధి కుక్కలు ఉండగా, అందులో 2.03 లక్షల కుక్కలకు స్టెరిలైజేష‌న్ పూర్తి అయినట్టు పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేసేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీని తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 

గుంటూరు తరహా ఘటనలు మళ్లీ తలెత్తకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కుక్కకాటు మందులు కూడా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని చెప్పుకొచ్చారు. 

అసలేం జరిగింది అంటే  : ఆదివారం సాయంత్రం గుంటూరులోని స్వర్ణ భారతి నగర్‌లో బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడి బాలుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్ళ ముందే మృతి చెందడంతో తల్లితండ్రులు నాగరాజు, రాణి ఏడ్చి ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. 

ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ మంత్రి నారాయణ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను పంపి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విషయం ముఖ్యమంత్రి వరకూ చేరడంతో ఐదు లక్షల రూపాయలను పరిహారంగా వారికి అందించారు. 

ఇటీవల నగరంలో కుక్కల హల్చల్ ఎక్కువైందని అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై దృష్టి సారించాల్సిందిగా సబంధిత శాఖలను ఆదేశించారు.