Abdul Nazeer AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ట్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ తోపాటు మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఇచ్చారు.
ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.
ఇప్పటి వరకు గవర్నర్‌గా పని చేసిన బిశ్వభూషణ స్థానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ వచ్చిన వేళ గతంలో ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ఈ మధ్యే ఘనంగా వీడ్కోలు పలికింది. విజయవాడలోని బందరు రోడ్డులోగల ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారని కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం అన్నారు.
ఒక తండ్రిలా, రాష్ట్రానికి పెద్దలాగా ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని ప్రస్తావించారు. గవర్నర్ వందేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ కోరుకున్నారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తనపట్ల చూపిన గౌరవం, ఆప్యాయత మర్చిపోలేనని గవర్నర్ మాట్లాడారు. ఏపీ ప్రజలు అందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన రెండో ఇల్లు లాంటిదని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మర్చిపోబోనని అన్నారు.
తాను గవర్నర్ గా ఏపీకి వచ్చిన కొత్తలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని జగన్ ను ప్రశ్నించానని, దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని కొనియాడారు. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనదని.. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’’ అని గవర్నర్ మాట్లాడారు.