Vijayawada Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నడిబొడ్డున మానవత్వం సిగ్గుతో తలవంచుకునే ఘటన వెలుగు చూసింది. అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న నగరంలో నేర ప్రవృత్తి ఏ స్థాయికి దిగజారిందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది రూపాయల కోసం వ్యక్తిని మైనర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఆ బాలుడు చేసిన పనికి నిరుపేద తాపీ పనివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
చిట్టినగర్ వద్ద రక్తపాతం
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. సమయం రాత్రి 11.30 గంటలు దాటుతోంది. నగరమంతా నిద్రావస్థలోకి వెళ్తున్న వేళ మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ అనే బాలుడు మందు కొనడానికి డబ్బులు సరిపోక వీధిలో వెళ్తున్న వారిని డబ్బులు అడిగాడు. అదే సమయంలో తన పని ముగించుకొని వెళ్తున్న తాతబ్బాయి అనే తాపీ పని వాడు కనిపించాడు.
తాగిన మత్తులో ఉన్న మైనర్ , తాతబ్బాయికి పది రూపాయలు ఇవ్వాలని అడిగాడు. పగలంతా కష్టపడి పని చేసి ఇంటికెళ్తున్న తాతబ్బాయి పది రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ చిన్న నిరాకరణను ఆ మైనర్ తట్టుకోలేకపోయాడు. మత్తులో ఉన్న అతనిలోని క్రూరత్వం మేల్కొంది. తన వద్ద ఉన్న కత్తిని తీసి వృద్ధుడిపై విచారణారహితంగా దాడి చేశాడు. వృద్ధుడి ఆర్తనాదాలు ఆ నిశ్శబ్ధ రాత్రిలో ఎవరికీ వినిపడలేదు.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తాతబ్బాయి ఒక సామాన్య తాపీపని వాడు. ఆయనది గుంటూరు జిల్లా మంగళగిరిలోని నులకపేట ప్రాంతం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో పని కోసం విజయవాడ వచ్చాడు. తాపీ పని చేసుకుంటూ తన జీవితానికి వెళ్లదీస్తున్న ఆయనకు ఇలా మైనర్ రూపంలో మృత్యువు వస్తుందని ఊహించలేదు. ఒక మైనర్ బాలుడి వ్యసనానికి ఒక శ్రామికుడి జీవితం బలి కావడం విషాదం నింపింది.
దాడి జరిగిన వెంటనే వృద్ధుడు రక్తపు మడుగులో అక్కడే పడిపోయారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో ఉన్న తాతబ్బాయిని గమనించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. రక్త స్రావం ఎక్కువ జరగడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి, నిందితుడి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఎక్కడికి తప్పించుకోలేడని త్వరలోనే పట్టుకుంటామని భావిస్తున్న టైంలో కేసులో ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించాడో లేదా తాను చేసిన తప్పును తెలుసుకున్నాడో తెలియదు కానీ ఆ బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.