కేంద్ర జ‌ల‌శక్తి మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్‌కి టీడీపీ ఎంపీ కేశినేని నాని లేఖ‌ రాశారు. ఎ.కొండూరు మండలంలో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధి పరిష్కారానికి  శాశ్వత పరిష్కారం చూపాల‌ని ఎంపీ కోరారు. 


 తీవ్రమవుతున్న సమస్య 


విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎ. కొండూరు మండల ప్ర‌జ‌లు, ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు,దళితుల అనిశ్చిత పరిస్థితులపై దృష్టి పెట్టాలని ఎంపీ కేశినేని నాని కోరారు. "ఎన్టీఆర్ జిల్లాలో ఎ.కొండూరు మండలం నోటిఫైడ్ గిరిజన ప్రాంతం..ఇక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో కిడ్నీ కేసులు బాగా పెరిగాయి. ఈ వ్యాధి  అనేక మంది రోగుల మ‌ర‌ణానికి దారి తీసింది. కిడ్నీ వ్యాధికి ప్రధాన కార‌ణం, క‌లుషిత‌మైన భూగ‌ర్భ జ‌లాల వినియోగ‌మ‌ని ప‌లు అధ్య‌యనాల త‌రువాత తేలింది. 55 శాతం గ్రామాల్లోని నీటి నమూనాలలో సిలికా, సీసం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కేసులు బాగా పెరగడానికి సిలికా ఫ్లోరైడ్ సాంద్రతలు పెరగడం ఒక కారణమని ICMR అధ్యయన నివేదికలు కనుగొన్నాయి' అని కేశినేని నాని అన్నారు.  


కోట్లు వెచ్చించి పైప్ లైన్ పనులు


జల్ జీవన్ మిషన్ కింద ఎ. కొండూరు ప్రాంతంలోని నివాస ప్రాంతాలకు రూ. 38 కోట్లు, రూ.27 కోట్ల అంచనా వ్యయంతో నీటి పైప్‌ లైన్ పొడిగింపు కూడా కేంద్రం సహకారంతో చేపట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న రోగి ఉన్నారు. ప్రస్తుతం 720 మంది కిడ్ని వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి కారణంగా అనేక కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయి. కిడ్నీ సమస్య పరిష్కరించడానికి కేంద్రం ప్రత్యేకంగా చొరవ చూపితే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి స్థానిక ప్రజలు బయటపడే అవకాశం ఉందని స్దానికులు అంటున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం-ఎంపీ కేశినేని 


కేంద్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటేనే స్థానికంగా ఉన్న వారి ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్రం తగిన చర్యలు తీసుకునేందుకు సానుకూలంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. జల జీవన్ మిషన్ కింద నిధులు కోసం కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి వెళ్ళలేదని, కిడ్నీసమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలనే  సమస్య మరింత జఠిలం అవుతుందని ఆవేదన చెందారు. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ గిరిజనులకు కనీస అవసరాలను కూడా సమకూర్చలేని దుస్దితి ఉందని,సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావటం లేదని అన్నారు. ఎ.కొండూరు మండల ప్రజలు లేవనెత్తిన డిమాండ్లను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టులను అమలు చేసి  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఎంపీ కేశినేని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులందరికీ కనీస అవసరాలు అందేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం కాబట్టి  కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి సహకరించాలని ఎంపీ కేశినేని నాని లేఖలో పేర్కొన్నారు.,