Batchula Arjunudu : ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు.  టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. 


ఇటీవల గుండెకు స్టంట్


టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉండటం వల్లే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని అప్పట్లో వైద్యులు తెలిపారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. 


1995 నుంచి రాజకీయాల్లో 


బచ్చుల అర్జునుడు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. బచ్చుల అర్జునుడు 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడై.. 2017లో జరిగిన ఎన్నికల్లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యారు. 






చంద్రబాబు, లోకేశ్ సంతాపం 


బచ్చుల అర్జునుడు మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం తెలిపారు. తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని చంద్రబాబు అన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నామన్నారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. బ‌చ్చుల అర్జునుడు మృతి స‌మాచారం తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యానని నారా లోకేశ్ అన్నారు. నిజాయితీకి మారుపేరు, అజాత‌శ‌త్రువు అయిన‌ అర్జునుడు టీడీపీ బ‌లోపేతానికి ఎన‌లేని కృషి చేశారన్నారు. అర్జునుడు క‌న్నుమూయ‌డం తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు అన్నారు. ఆయ‌న స్మృతిలో నివాళుల‌ర్పిస్తున్నానని, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు.  






సమీక్షా సమావేశం వాయిదా 


 రేపు అమరావతిలో జరగాల్సిన టీడీపీ జోన్ -3 సమీక్షా సమావేశం  వాయిదా పడింది. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతికి సంతాపం తెలుపుతూ రేపు అమరావతిలో జరగాల్సిన తెలుగుదేశం పార్టీ జోనల్ స్థాయి సమీక్షా సమావేశం వాయిదా వేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.