Police have announced Two Lakhs Offer :  ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి చేసిన ఘటనలో పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయి వేసిన వ్యక్తి గురించి చెబితే రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామన్నారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089  సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు.                   

  


సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.   నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే పోలీసులు అధికారికంగా చెప్పలేదు. దాడి  చేసిందెవరో సమాచారం చెప్పాలని బహిరంగ ప్రకటన ఇవ్వడంతో..  ఇంకా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదని తెలుస్తోంది.                      


బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై శనివారం సాయంత్రం దాడి జరిగింది.  సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నట్లు తెలిసింది.                                                


జగన్ పై దాడికి సంబంధించి ఈసీ ఇప్పటికే పోలీసులను నివేదిక కోరింది. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ సమీపంలోని స్కూలు పైన నుంచి దాడి చేసినట్లు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రచారానికి సంబంధించి భద్రత అధికారులు పలు సూచనలు చేశారు. యాత్ర చేస్తున్నప్పుడు జమాలలు, క్రేన్ ల ద్వారా అభినందనలు తీసుకొవద్దని సూచించారు. ఇక దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.          


ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకమని టీడీపీ ఆరోపిస్తోంది. చిన్న గాయానికి 18మంది డాక్టర్లతో చికిత్స అవసరమా అని ఎంపీ రఘురామకృష్ణమరాజు అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి పెద్ద సర్జరీలకే 5, 6మంది డాక్ట్రర్లు ఉంటారని, అలాంటిది చిన్న గాయానికి అంత మంది డాక్టర్లు ఏంటని అంటున్నారు. అయితే రాయి దాడిని  నాటకం అనడం కరెక్ట్ కాదని.. వైసీపీ వర్గాలంటున్నాయి. ఎవరైనా తమను తాము రాయితో దాడి చేయించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.