Vijayawada News: బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయన్న ఆర్టీసీ ఎండీ - ఎక్సలేటర్ పట్టేయడంతోనే ప్రమాదమన్న బస్సు డ్రైవర్, ఏది నిజం?

Vijayawada News: విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని ఆర్టీసీ ఎండీ చెప్పగా, ఎక్సలేటర్ పట్టేయడంతోనే రివర్స్ గేర్ వేశానని బస్సు డ్రైవర్ తెలిపారు.

Continues below advertisement

Vijayawada News: విజయవాడ నెహ్రూ బస్టాండులో సోమవారం ఉదయం బస్సు ప్రమాద ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సాంకేతిక తప్పిదమా.?, మానవ తప్పిదమా.? అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. ఘటనపై 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Continues below advertisement

అయితే, ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ వివరణ మరోలా ఉంది. బస్సు ఎక్సలేటర్ పట్టేసిందని, అందువల్ల కదలకపోవడంతో, రివర్స్ గేర్ వేశానని చెబుతున్నారు. 'బస్సు ఎక్సలేటర్ పట్టేసింది. దాంతో నేను రివర్స్ గేర్ వేశాను. బస్సు ముందుకు పోనిద్దామని మూవ్ చేశాను. అది పట్టుకునిపోవడం వల్ల నాకు ఏం అర్థం కాలేదు. బస్సుకు ఆ సమస్య ఎప్పటి నుంచో ఉందంట. నేను ఆదివారం నుంచే ఆ బస్సు డ్రైవ్ చేస్తున్నాను.' అంటూ డ్రైవర్ తెలిపారు. ఈ క్రమంలో పూర్తి విచారణతోనే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.

సీఎం దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది 

విజయవాడలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉండగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు - 2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్ (18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడు మృతి చెందాడు.

రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్

బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి 11, 12 ప్లాట్ ఫాంల వద్ద రెయిలింగ్ తో పాటు, ప్లాట్ ఫైం ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా బస్సు పైకి రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

'24 గంటల్లో విచారణ'

బస్సు ప్రమాదం ఘటన దురదృష్టకరమని, బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులున్నారని, బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన, 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Also Read: హృదయ విదారకం - మూడేళ్ల చిన్నారిని బలిగొన్న విద్యుత్ స్తంభం, గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు

Continues below advertisement