Vijayawada News: విజయవాడలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, ఓ మహిళ, చిన్నారి ఉండగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ ను గుంటూరు - 2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్ (18 నెలలు)కు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడు మృతి చెందాడు.



రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్


బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి 11, 12 ప్లాట్ ఫాంల వద్ద రెయిలింగ్ తో పాటు, ప్లాట్ ఫైం ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా బస్సు పైకి రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


సీఎం దిగ్భ్రాంతి


బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 


మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా


ఈ ఘటన దురదృష్టకరమని, బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులున్నారని, బస్సు బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రమాద ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన 24 గంటల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై పూర్తి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు. 


'ప్రభుత్వమే బాధ్యత వహించాలి'


ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. 'ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. కాలం చెల్లిన బస్సుల కారణంగా తరచూ బస్సు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీలో నట్లు, బోల్టులు కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడం లేదు. రిక్రూట్మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.' అని లోకేశ్ అన్నారు.


స్కూల్ బస్సు బోల్తా


మరోవైపు, కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. అవనిగడ్డలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు, కోడూరు మండలం, విశ్వనాథపల్లె సమీపంలో అదుపు తప్పి కాలువలో పడిపోయింది. స్టీరింగ్ రాడ్ విరగడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సులోని విద్యార్థులు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. అవనిగడ్డ నుంచి కోడూరు వరకూ రహదారి మరమ్మతులకు గురి కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.