Vijayawada News : ఏడాది పాల‌న త‌రువాత బెజ‌వాడ కార్పొరేట‌ర్లు విహార యాత్ర ప్లాన్ చేశారు. కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్న నేతలకు విహార యాత్ర కొత్త చిక్కులు తెచ్చింది. విహార యాత్ర పొలిటిక‌ల్ వివాదానికి తెర తీసింది. ఇప్పటికే ఆర్థిక ప‌రిస్థితులు అంతంత మాత్రం ఉన్న నేపథ్యంలో కార్పొరేట‌ర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహార యాత్రకు తెర తీయ‌టంపై ప్రతిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించ‌కుండా, కార్పొరేట‌ర్లు విహ‌ర యాత్రకు వెళ్లటం ఏంటని, వామ‌ప‌క్షాలు విమర్శలు చేస్తున్నాయి. 


విజ్ఞాన యాత్రపై వివాదం 


బెజ‌వాడ మున్సిపల్ కార్పొరేష‌న్ కార్పొరేట‌ర్లు విజ్ఞాన యాత్రకు రెడీ అవుతున్నారు. అయితే ఈ విష‌యంపై రాజ‌కీయంగా దుమారం చెలరేగుతోంది. పాల‌క వ‌ర్గం ఎన్నిక‌యిన‌ప్పుడు విజ్ఞాన యాత్ర పేరుతో యాత్రల‌కు వెళ్లటం ప‌రిపాటిగా మారింది. అయితే ఈ సారి కార్పోరేష‌న్ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. క‌రోనా కార‌ణంగా ఖ‌జానాపై ప్రభావం ఏర్పడింది. ఈ స‌మ‌యంలో కార్పొరేట‌ర్లు 11 రోజుల పాటు యాత్రకు ప‌య‌నం అవుతుండడంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంత‌రం తెలుపుతున్నాయి. కార్పొరేష‌న్ లో ఉన్న ప‌రిస్థితులపై అవ‌గాహ‌న లేకుండా ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విజ్ఞాన యాత్ర పేరుతో శ్రీ‌న‌గ‌ర్ లోని శంక‌రాచార్య ఆల‌యం, కాట్రాలోని వైష్ణో దేవి ఆల‌యం, అమృత్ స‌ర్ గోల్డెన్ టెంపుల్ కు వెళ్లటం వెనుక అంత‌ర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 11 రోజుల పాటు జ‌రిగే యాత్రలో భాగంగా ఫ్లైట్ ఛార్జీలు, హోట‌ల్ ఛార్జీలు, భోజ‌నం, టిఫిన్ ఖ‌ర్చుల‌కు ఒక్కో కార్పొరేట‌ర్ కు ఒక ల‌క్షా 7 వేల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు అవుతుంది. ఎంత మంది కార్పొరేట‌ర్లు వ‌స్తే అన్ని లక్షలు అన్నమాట‌. కార్పొరేటర్లతో పాటు అధికారులు, సిబ్బంది కూడా ఇందులో జాయిన్ అవుతారు. వారికి కూడా కార్పోరేష‌న్ ఖ‌ర్చులు భ‌రించాల్సి ఉంటుంది. దీంతో కార్పొరేష‌న్ ఖ‌జానాపై భారం పెరుగుతుంద‌ని చెబుతున్నారు.


విడుదల కాని గ్రాంట్లు 


రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెజవాడ కార్పొరేషన్ కు రూ. 150 కోట్ల గ్రాంట్లు ఖరారు అయ్యాయి. అయితే అవి ఇంత వ‌ర‌కు కార్పొరేష‌న్ ఖ‌జానాలో జ‌మకాలేదు. ఇదే స‌మ‌యంలో కార్పొరేష‌న్ ఆర్థిక భారం లెక్కలను విప‌క్షాలు బ‌యట‌పెడుతున్నాయి. 14,15 ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం ప్రభుత్వం విడుద‌ల చేసినా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేష‌న్ కు ఇంకా రిలీజ్ చేయ‌లేదు. ఆ నిధుల‌ను మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల‌ను కూడా తెప్పించ‌లేని వైసీపీ పాల‌కులు యాత్రల పేరుతో ల‌క్షలాది రూపాయ‌ల ప్రజాధ‌నం దుర్వినియోగం చేస్తున్నార‌ని ప్రతిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఒక్కో కార్పొరేట‌ర్‌కు ల‌క్ష రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌డం దారుణ‌మ‌ని అంటున్నారు.