Minister Buggana : సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యంగా, పన్నుల వసూళ్లలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమేని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజయవాడలోని ట్రేడ్ అడ్వైజరీ కమిటీ (వాణిజ్య సలహా మండలి) సమావేశంలో మంత్రి రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. వాణిజ్యవేత్తల సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రతి 3 నెలలకోసారి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాజుల కాలంలో కూడా అభివృద్ధి, పరిపాలనలో పన్నులు కీలక పాత్ర పోషించాయన్నారు. జై జవాన్, జై కిసాన్... జై బిజినెస్ మెన్ వైసీపీ ప్రభుత్వ నినాదమన్నారు. మన భవిష్యత్ కోసం మనం కట్టేదే వాణిజ్య పన్ను అని, వాణిజ్యవేత్తలకు భరోసా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పువ్వుకు ఇబ్బందిలేని పద్ధతిలో మకరందం తీసుకుని తేనెగా తయారుచేసే తేనెటీగ మాదిరిగా.. పన్ను వసూళ్లలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రభుత్వ విధానమని వెల్లడించారు. డీలర్ ఫ్రెండ్లీ ప్రభుత్వ విధానంలో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయన్నారు. వాణిజ్యవేత్తలపై దాడులను తగ్గిస్తామని తెలిపారు. డేటా ఎనలిటిక్స్ సెల్ ద్వారా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని నిర్ణయాలు కౌన్సిల్ ద్వారా తీసుకుంటున్నామని, వాణిజ్యవేత్తలు ఇచ్చిన సలహాలు, సూచనలు అన్నీ కౌన్సిల్ లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ ద్వారా అత్యధికంగా జీఎస్టీ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని ఆయన తెలిపారు. శాఖలు, డీలర్ల, వాణిజ్యవేత్తల సమన్వయంతో సమావేశాలు నిర్వహించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ప్రతి మూడు నెలలకు
అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలలో ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాల ద్వారా విధానపరమైన అంశాలు, ఇబ్బందులను వాణిజ్యవేత్తల నుంచి ప్రభుత్వం చర్చిస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బంగారం తయారీ, తరుగుపై ధరల విషయంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు చెప్పిన అంశంపై దృష్టి పెడతామని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. వ్యాపారుల సౌకర్యార్థం జీఎస్టీ నిబంధనలను తెలుగులో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న డీలర్లు, చిరు వ్యాపారుల దృష్టికి వెళ్లకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. జీఎస్టీ పోర్టల్ వల్ల వ్యాపారులకు కలిగిన ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. పన్నుల ధరల సమయం, మార్పుల అధికారం జీఎస్టీ మండలిదేనని స్పష్టం చేశారు. వాణిజ్యవేత్తల చొరవతో, చర్చలతో మరింత పారదర్శకత, సరళ విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతి మూడు నెలలకు ఈ సమావేశాలను నిర్వహిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
వ్యాపారుల వద్దకే ప్రభుత్వం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వ్యాపారుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని అధికారురు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యవేత్తలు, అధికారులు ఇద్దరూ మాట్లాడుకుంటే సమస్యలు ఉండవన్నారు. నగరంలో పెద్ద పెద్ద షాపులు, షోరూంలు వినియోగదారులను దోపీడీ చేస్తున్నాయని సభాముఖంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపారు. బంగారం దుకాణాల్లో తరుగు పేరుతో 20 శాతం నుంచి 30 శాతం కూడా వసూలు చేస్తున్నారని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కి మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండాలనే ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. వర్తకుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. చట్టాలకు అనుగుణంగా నిబద్దతతో వ్యాపారం చేసే వారిపై పన్నుల విషయంలో అధికారుల దాడులు సరికాదన్నారు. వ్యాపారులు తప్పుచేస్తే చర్యలు తీసుకోవాలని, అకారణంగా చర్యలు వద్దన్నారు. విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని, కరోనా వంటి ఆపత్కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ మాట్లాడుతూ.. ట్రేడ్ అడ్వజరీ కౌన్సిల్ నుంచి సూచనలు, సలహాలు తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టామన్నారు. దీని ద్వారా వాణిజ్యవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.