Population Control Law:


అసహనం 


జనాభా నియంత్రణకు ఓ చట్టం  (Population Control Law)చేయాలని బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. చట్టాలు చేయమని చెప్పడం కోర్టుల పని కాదని, అది పార్లమెంట్‌లో తేల్చుకోవాల్సిన విషయం అని వ్యాఖ్యానించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్‌లు వేస్తుంటారని మండిపడింది. ఇలాంటి పిటిషన్లను విచారించలేమని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏస్ ఓకాతో
కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. "ఇలాంటివి కోర్టు డిసైడ్ చేస్తుందని ఎలా అనుకుంటారు. కాస్తైనా అర్థముండాలిగా" అని ఘాటుగా స్పందించింది. ఈ వ్యాఖ్యల తరవాత ఉపాధ్యాయ్ తన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. 




పిటిషన్‌లో ఏముంది..? 


బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్‌తో పాటు ఇంకొందరు ఇదే అంశంపై పిటిషన్ వేశారు. జనాభా పెరుగుతుండటం వల్ల ప్రజలకు ప్రభుత్వాలు సౌకర్యాలు అందించలేకపోతున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రపంచం మొత్తంలో ఉన్న వ్యవసాయ భూమిలో భారత్‌లో 2% ఉందని, ఇక తాగు నీటి పరంగా చూస్తే ఆ వాటా 4% అని తెలిపారు. కానీ...జనాభాలో మాత్రం భారత్ వాటా 20%గా ఉందని చెప్పారు. జనాభా పెరుగుదల కారణంగా...కనీస సౌకర్యాలైన ఆహారం, తాగునీరు, విద్య, ఇల్లు, ఆరోగ్యం లాంటివి అందరికీ సమానంగా అందడం లేదని పిటిషన్‌లో వివరించారు. జనాభా నియంత్రణ చేయగలిగితే...ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలు చేసి అందరికీ లబ్ధి చేకూర్చిన వాళ్లమవుతామని చెప్పారు. గతంలోనూ ఉపాధ్యాయ్ ఢిల్లీ కోర్టులో ఈ పిటిషన్ వేయగా...ఆ న్యాయస్థానమూ కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై అప్పట్లో కేంద్రం కూడా స్పందించింది. జనాభా నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం సరికాదని, అది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం అని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను లా కమిషన్‌కు పంపాలన్న అభ్యర్థననూ సుప్రీం కోర్టు తిరస్కరించింది. "ఈ విషయంలో మీ వాదనలేంటో వినిపించండి. అంతే కానీ లా కమిషన్‌ ఇవ్వాలని మాత్రం అడగొద్దు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తప్పనిసరి
అనే నిబంధనను తొలగించాలని మీరు కోరుతున్నారు. అది ప్రభుత్వం పరిధిలోని విషయం" అని వెల్లడించింది. 


భగవత్ వ్యాఖ్యలు..


జనాభా నియంత్రణపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు. అయితే జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉందని భగవత్ అన్నారు.


" జనాభా నియంత్రణ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇలానే చేసిన చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాలి. 'ఒకే సంతానం' విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోంది. 57 కోట్ల యువత కలిగిన భారత్‌.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుంది. "                                       
-  మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


Also Read: UN on Indian Population: 2023 నాటికి జనాభాలో మనమే టాప్- రెండో స్థానానికి చైనా!